పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఇన్నాళ్లకు జ్ఞానోదయమైంది. తమ దిగ్గజ ఆటగాళ్లను గౌరవించేందుకు ఆదివారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్' మాదిరిగా సొంతంగా 'పీసీబీ హాల్ ఆఫ్ ఫేమ్' పేరిట పాక్ క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు సాధించిన మాజీలను సత్కరించే దిశగా నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా తొలిసారి ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో ఆరుగురు దిగ్గజాలను ఎంపిక చేసింది.
ఇదీ చదవండి: గడ్డం పెంచితే.. నా పని అంతే: పాంటింగ్
ఈ జాబితాలో పాక్ ప్రధాని, మాజీ సారథి ఇమ్రాన్ ఖాన్ ఉండటం విశేషం. అలాగే హనీఫ్ మహ్మద్, జావెద్ మియాందాద్, వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, జహీర్ అబ్బాస్ లాంటి గొప్ప ఆటగాళ్లను పీసీబీ హాల్ ఫేమ్ క్రికెటర్లుగా ఎంపిక చేసింది. 2021 నుంచి ఏటా అక్టోబర్ 16న ముగ్గురు క్రికెటర్లను ఈ గౌరవార్థం కోసం ఎంపిక చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఇందులో అర్హత సాధించాలంటే ఆయా ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఐదేళ్లు పూర్తిచేసి ఉండాలని పీసీబీ చీఫ్ ఎహ్‌సన్ మణి పేర్కొన్నారు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పలువురు మేటి క్రికెటర్లను తీర్చిదిద్దిందని, వారు ప్రపంచ క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు సాధించారని మణి చెప్పుకొచ్చారు. తొలిసారి ప్రవేశపెడుతున్న ఈ కార్యక్రమంలో ఆరుగురు దిగ్గజాలను ఎంపిక చేయడం సరైన నిర్ణయమని చెప్పాడు. వీరు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని పీసీబీ చీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఆసియన్ క్వాలిఫయింగ్ పోటీల్లో భారత రెజ్లర్ల ఓటమి