భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు బలపడడానికి తాము బీసీసీఐ వెంట పరిగెత్తమని పీసీబీ ఛైర్మన్ ఎహ్సాన్ మణి స్పష్టం చేశాడు. పాకిస్థాన్ జట్టు ప్రస్తుత ఇంగ్లాండ్ పర్యటన మొదలుకొని భారత్-పాక్ ద్వైపాక్షిక క్రికెట్‌పైనా స్పందించాడు. ఈ సందర్భంగా పాక్ యువ పేసర్ నసీమ్ షాను ప్రశంసించాడు. అతడు బాగా ఆడుతున్నాడని, శ్రీలంకపై ఇటీవల మంచి ప్రదర్శన చేశాడని మెచ్చుకున్నాడు.
అనంతరం భారత్-పాక్ క్రికెట్ గురించి మాట్లాడిన మణి.. 2003లో తాను ఐసీసీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు బలపడడానికి భారత దేశ మంత్రులతో చర్చించానని చెప్పాడు. ఆ పదవిలో కూర్చున్నాక తన తొలి సమావేశం ముంబయిలో జరిగిందని, అప్పుడు భారత్-పాక్ మధ్య క్రికెట్ గురించి ప్రస్తావిస్తే వారి నుంచి సరైన సమాధానం రాలేదని చెప్పాడు. టీమ్‌ఇండియాతో ఆడడానికి తామెప్పుడూ సిద్ధంగా ఉన్నామని, ఇదే విషయాన్ని బీసీసీఐ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపాడు. ఇప్పుడీ విషయంపై బీసీసీఐ వెనుక పరిగెత్తమని, వాళ్లెప్పుడు ఆడాలని ముందుకు వస్తే అప్పుడు సిద్ధంగా ఉంటామని పేర్కొన్నాడు.