టీమిండియాతో జరిగిన మూడో టీ20లో పరాజయం చెందడంపై విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ స్పందించాడు. తమ ప్రణాళికలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమవ్వడం వల్లే ఓడిపోయామని అసహనం వ్యక్తం చేశాడు. నిలకడలేని బౌలింగే తమ కొంపముంచిందని అసంతృప్తి వ్యక్తం చేశాడు.
"భారత్ 240 పరుగులు చేసిందంటే మా ప్రణాళికలను మేం సరిగ్గా అమలు చేయలేకపోయామనే చెప్పాలి. మా బౌలర్లు లయ తప్పారు. ఈ సిరీస్‌లో మేం బాగానే రాణించినప్పటికీ చివరి మ్యాచ్‌లో అనుకున్న స్థాయిలో ఆడలేకపోయాం" - కీరన్ పొలార్డ్, విండీస్ కెప్టెన్.
కోహ్లీ, రోహిత్‌లపై ప్రశంసల వర్షం కురిపించాడు పొలార్డ్.
"కోహ్లీ లాంటి క్లాస్ బ్యాట్స్‌మెన్‌కు చెత్త బంతులను సంధిస్తే బౌండరీ ద్వారే సమాధానం చెబుతాడు. అతడు బాగా ఆడే లైన్ అండ్ లెంగ్త్‌లోనే బౌలింగ్ చేసి మూల్యం చెల్లించుకున్నారు మా బౌలర్లు. రోహిత్ తొలి రెండు గేముల్లో పెద్దగా ఆడలేదు. కానీ వాంఖడేలో పరిస్థితి అతడికి బాగా తెలుసు. అవకాశమొచ్చింది విశ్వరూపం చూపించాడు. అసలు మా ప్రణాళికలు సరిగ్గా అమలు చేసుంటే ఇప్పుడు ఈ చర్చే వచ్చేది కాదు" - కీరన్ పొలార్డ్, విండీస్ కెప్టెన్.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 3 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(70: 29 బంతుల్లో), కేఎల్ రాహుల్(91: 56 బంతుల్లో), రోహిత్ శర్మ(70: 34 బంతుల్లో) కరీబియన్ బౌలర్లను ఉతికిఆరేశారు. అనంతరం బరిలోకి దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసి ఓడింది. ఫలితంగా టీమిండియా 2-1తో సిరీస్ గెల్చుకుంది.
ఇదీ చదవండి: యువీ బర్త్‌డే స్పెషల్: అలాంటి విజయాలు నీకే సొంతం..!