భారత్‌తో జరగనున్న సిరీస్‌ల్లో తమ జట్టు నుంచి ఎటువంటి కవ్వింపు చర్యలు ఉండవని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు. మాటల యుద్ధం జరగకుండానే ఇరు జట్ల మధ్య పోటీ తారస్థాయిలో ఉంటుందని అన్నాడు.
"ప్రత్యర్థి జట్లు ఆస్ట్రేలియా పర్యటనకు రావడం కాస్త ఇబ్బందిగా భావిస్తాయి. అయితే అది దూషించుకోవడం, కవ్వింపులతో వచ్చేది కాదు. అత్యుత్తమ ఆటగాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని అలా ఫీల్ అవుతాయి. షేన్ వార్న్, మెక్‌గ్రాత్, స్టీవ్ వా, గిల్‌క్రిస్ట్, పాంటింగ్ వంటి ఆటగాళ్లతో ఆడాలనే భావనే ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను ఎక్కువ ఇబ్బందికి గురిచేస్తుంది. అయితే గత కొన్నేళ్లుగా మేం మైదానంలో, వెలుపలా వివాదాలకు దూరంగా ఉన్నాం. కేవలం పోటీలోనే సరదాని కోరుకుంటున్నాం."
- జస్టిన్ లాంగర్, ఆస్ట్రేలియా ప్రధానకోచ్
"కెప్టెన్ టిమ్ పైన్ ఎంతో హాస్యాన్ని పండించగలడు. అలాగే కోహ్లీని మేం ఎంతో ఇష్టపడతాం. మైదానంలో అది చాలా బాగుంటుంది. మొత్తంగా ఆటగాళ్లపై వచ్చే ఒత్తిడి మాటలతో కాదని, పోటీ ద్వారా వచ్చేదని నా అభిప్రాయం. ఇక భారత్-ఆసీస్ సిరీస్ జరుగుతున్నందుకు మేం ఎంతో సంతోషిస్తున్నాం. ఇరు జట్లలో గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. మాటల యుద్ధం జరగకుండానే మైదానంలో వేడి ఉంటుంది" అని లాంగర్ తెలిపాడు.
భారత్‌తో సిరీస్‌లో స్లెడ్జింగ్‌కు దూరంగా ఉంటామని ఇటీవల వార్నర్ కూడా స్పష్టం చేశాడు. కంగారూల గడ్డపై మ్యాచ్ అంటేనే ఆస్ట్రేలియా ఆటగాళ్ల కవ్వింపులు ఉంటాయని అందరూ భావిస్తుంటారు. కానీ, లాంగర్, వార్నర్ ప్రకటనలతో ఈసారి భారత్‌తో జరిగే సిరీస్ భిన్నంగా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో.. భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. సిడ్నీ వేదికగా తొలి వన్డే జరగనుంది.