2011 ప్రపంచకప్ ఫైనల్లో తమ జట్టు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందని, భారత్‌కు కప్ అమ్మేసిందని శ్రీలంక మాజీ క్రీడాశాఖామంత్రి మహిందానంద ఇటీవలే చేసిన ఆరోపణల నేపథ్యంలో లంక ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేపట్టింది. అప్పుడు జట్టులో ఉన్న క్రికెటర్లతో పాటు సహాయ సిబ్బందిని విచారించింది. ఇందులో భాగంగా ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిపిన పోలీసులు.. కేసు విచారణ పూర్తయినట్లు వెల్లడించారు.
రిపోర్ట్స్‌ను లంక క్రీడా మంత్రిత్వశాఖ సెక్రటరీకి పంపించామని, అంతర్గత భేటీ తర్వాత దర్యాప్తును పూర్తి చేస్తామని సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ జగత్ ఫోన్సెకా వెల్లడించారు.
దర్యాప్తులో భాగంగా అప్పటి లంక జట్టు చీఫ్ సెలక్టర్ అరవింద్ డిసిల్వా, కెప్టెన్ సంగక్కర, బ్యాట్స్‌మెన్ ఉపుల్ తరంగ, మహేలా జయవర్ధనేలను పోలీసులు ప్రశ్నించారు. వీరిలో డిసిల్వాను 6 గంటలు, సంగక్కరను దాదాపు 10 గంటల పాటు పలు అంశాలు గురించి అడిగి తెలుసుకున్నారు.
అయితే 2011 ప్రపంచకప్ ఫైనల్లో లంక జట్టులో చేసిన ఆకస్మిక మార్పుల గురించి.. ముగ్గురు లంక క్రికెటర్లు తమ స్టేట్మెంట్స్ ఇచ్చారని ఫోన్సెకా చెప్పారు.
అయితే ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన మాజీ క్రీడామంత్రి మహిందానందపై, లంక ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. టోర్నీ జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత ఇలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.
ఇవీ చదవండి: