టీమ్‌ఇండియా యువపేసర్ తంగరసు నటరాజన్ సుదీర్ఘ ఫార్మాట్లో చేయాల్సింది ఇంకెంతో ఉందని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. అతడి బౌలింగ్ శైలి అతడికెంతో ప్రయోజనకరంగా ఉందని పేర్కొన్నాడు. జాతీయ జట్టుకు కనీసం ఏడెనిమిది ఏళ్లైనా సేవలు అందించాలని నట్టూకు సూచించాడు.
తమిళనాడు యువ పేసర్ నటరాజన్ ఆస్ట్రేలియా సిరీసులో చరిత్ర సృష్టించాడు. నెట్ బౌలర్‌గా ఆసీస్ చేరుకొని వన్డే, టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. చక్కని ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పదునైన యార్కర్లు, లెంగ్త్ బంతులతో కంగారూ ఆటగాళ్లను కంగారు పెట్టాడు. అంతకుముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో నట్టూ దుమ్మురేపిన సంగతి తెలిసిందే.
'టెస్టుల్లో నటరాజన్ చేయాల్సింది ఇంకెంతో ఉంది. లయ, యాంగిల్‌పై అతడు మరింత దృష్టి సారించాలి. నిజానికి అతడి బౌలింగ్ శైలే అతడి అదృష్టం. అయితే బంతి విడిచే తర్వాత దేహాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడు బంతి బ్యాట్స్‌మెన్ మీదకు వెళ్తుంది. దేశానికి కనీసం 5-7 ఏళ్లు ఆడేలా తొలుత అతడు లక్ష్యం నిర్దేశించుకోవాలి. అందుకోసం ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టాలి. తన అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలను పూర్తిగా ఉపయోగించాలి. ఆడుతున్నప్పుడు మరిన్ని అస్త్రాలు నేర్చుకోవాలి. అతడు మరింత మెరుగయ్యేందుకు జట్టు యాజమాన్యం కచ్చితంగా కృషి చేస్తుందనే అనుకుంటున్నా' అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు.
ఇదీ చదవండి: బుమ్రాను ఎదుర్కోవడం సవాలే: రోరీ బర్న్స్