టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఇంగ్లాండ్ సారథి జో రూట్ కొనియాడాడు. అశ్విన్ వరల్డ్ క్లాస్ ప్లేయరని, సొంత మైదానంలో ఎంతో విలువైన ఆటగాడని అన్నాడు.
"అశ్విన్ వరల్డ్ క్లాస్ ప్లేయర్. ఎడమచేతి వాటం ఆటగాళ్లపై అతడికి ఉన్న రికార్డు ఎవరికైనా కాస్త గమ్మత్తుగా అనిపిస్తుంది. తన నైపుణ్యంతో అంత గొప్ప రికార్డు సాధించాడు. సొంత మైదానంలో అతడు ఎంతో విలువైన ఆటగాడు. గత మ్యాచ్‌లో శతకం బాదడం, లీచ్ బౌలింగ్‌లో అతడు ఆడిన తీరుని గమనించా. అతడు క్రీజును చక్కగా ఉపయోగించుకుంటున్నాడు."
- జో రూట్, ఇంగ్లాండ్ కెప్టెన్
చెపాక్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండోటెస్టులో టీమ్ఇండియా గెలుపొందడంలో అశ్విన్ కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో శతకంతో పాటు 8 వికెట్లను పడగొట్టాడు.
టీమిండియా వికెట్‌కీపర్ రిషభ్ పంత్ గురించి రూట్ మాట్లాడుతూ.. "పంత్‌కు ఎంతో నైపుణ్యం ఉంది. అయితే అతడు ఓ అవకాశం ఇస్తాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇక మొతెరా అద్భుతమైన స్టేడియం. ఇది గొప్ప క్రికెట్‌కు వేదికగా నిలుస్తుందని, ఇరు జట్లకు సమాన అవకాశాలు ఇస్తుందని ఆశిస్తున్నా. ఇక్కడ ఉత్తేజకరమైన భావన కలుగుతుంది. గత మ్యాచ్‌లో అభిమానులు స్టేడియానికి వచ్చారు. కానీ, ఇక్కడ స్టేడియం సామర్థ్యంతో అభిమానులు చేసే కేరింతలు గొప్ప అనుభూతిని కలిగిస్తాయి" అని అన్నాడు.
మొతెరా వేదికగా రేపటి నుంచి భారత్×ఇంగ్లాండ్ మధ్య డే/నైట్ టెస్టు జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌తోనే మొతెరా స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభం కానుంది. లక్షా పది వేల మంది వీక్షించే సామర్థ్యం స్టేడియం సొంతం.
ఇదీ చూడండి: 'వచ్చే వారం మైదానంలో అడుగుపెడతా'