ఆర్మీలో సేవలందించాలని భావించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. వెస్టిండీస్ పర్యటనకు దూరంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు అందుబాటులోకి వస్తాడని అందరూ భావించారు. కానీ ఈ సీనియర్ ఆటగాడు లేకుండానే జట్టును ప్రకటించింది సెలక్షన్ కమిటీ. అతడి స్థానంలో యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్‌కు మరోసారి అవకాశం కల్పించింది.
దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ కోసం ధోనీ, కుల్దీప్, చాహల్‌కు చోటు కల్పించలేదు. ధోనీకి స్థానం లేకపోవడంపై విమర్శలూ వచ్చాయి. ఈ విషయంపై వివరణ ఇచ్చాడు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్. ఈ సిరీస్‌కూ ధోనీ అందుబాటులో లేడని అందుకే అతడిని ఎంపిక చేయలేదని తెలిపాడు.
మరోసారి వారికి అవకాశం
టీమిండియాలో సుస్థిర స్థానం సంపాందించుకుంటోన్న స్పిన్ ద్వయం కుల్దీప్, చాహల్నూ దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు. బదులుగా రాహుల్ చాహర్, కృనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్‌లకు అవకాశం కల్పించింది సెలక్షన్ కమిటీ.
"టీమిండియా కోసం స్పిన్ బృందాన్ని తయారు చేయాలని భావిస్తున్నాం. గత సిరీస్‌లో రాహుల్ చాహర్, కృనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్ మంచి ప్రదర్శన కనబర్చారు. అందుకే మరోసారి వారికి అవకాశం కల్పించాలని భావించాం". -ఎమ్మెస్కే ప్రసాద్, టీమిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్
దక్షిణాఫ్రికాతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ సెప్టెంబర్ 15న ప్రారంభమవుతుంది. అనంతరం సఫారీలతో మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది కోహ్లీసేన.
ఇవీ చూడండి.. కోచ్ రవిశాస్త్రి.. పాప్ సింగర్‌గా మారిన వేళ