ప్రపంచకప్‌లో ఫేవరెట్లుగా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు పాకిస్థాన్‌పై ఓటమి పాలైంది. సమష్టిగా రాణించిన పాక్.. ఇంగ్లీష్ జట్టుకు ఝలక్ ఇచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓటమికి కారణం తమ జట్టు చెత్త ఫీల్డింగ్ అని ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ తెలిపాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్న ఇంగ్లాండ్ పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో మాత్రం విఫలమైంది. జట్టులో మంచి ఫీల్డర్‌గా ఉన్న జాసన్ రాయ్.. హఫీజ్ క్యాచ్‌ను వదిలేయడం ఇంగ్లాండ్ జట్టు కొంపముంచింది. 14 పరుగుల వద్ద అతని క్యాచ్ వదిలేశాడు రాయ్. చివరకు 84 పరుగులు చేసి పాక్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
"చెత్త ఫీల్డింగ్ వల్ల మేం 50 నుంచి 60 పరుగులు అదనంగా సమర్పించుకున్నాం. బ్యాటింగ్, బౌలింగ్‌లో అప్పుడప్పుడు విఫలమైనా ఫీల్డింగ్‌లోని లోపాలు బాధ కలిగిస్తాయి. మా జట్టులో ఇలా జరగడం చాలా అరుదు.''
-మోర్గాన్, ఇంగ్లాండ్ కెప్టెన్
ఈ మ్యాచ్‌లో 349 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 334 పరుగులకే పరిమితమైంది. జట్టులో రూట్ (107), బట్లర్ (103) అద్భుత పోరాటం చేసినా ఫలితం లేకపోయింది.
బౌలర్ ప్లంకెట్ స్థానంలో మార్క్‌వుడ్‌ని తీసుకోవడాన్ని సమర్థించుకున్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్. వుడ్ ఎక్కువ పేస్ రాబట్టగలడని.. అతడి బౌలింగ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్ ఇబ్బందిపడతారని అనుకున్నామని పేర్కొన్నాడు.
ఇవీ చూడండి.. WC19: పాక్- ఇంగ్లాండ్ మ్యాచ్‌లో రికార్డులు