టీమ్‌ఇండియాతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ గెలిచిన కారణంగా ఆ జట్టు మాజీ సారథి మైఖేల్ వాన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇది కోహ్లీసేనకు గుణపాఠం అని విమర్శలు చేశాడు. మ్యాచ్ అనంతరం రెండు ట్వీట్లు చేసిన వాన్.. భారత్ 40 ఓవర్ల పాటు నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం.. రెండేళ్లలో స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌లో నష్టం కలిగిస్తుందని అభిప్రాయపడ్డాడు.
"40 ఓవర్ల పాటు నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం వల్ల రెండేళ్లలో స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌లో నష్టం కలుగుతుంది. ఇలాంటి ఫ్లాట్ వికెట్లపై 375కి పైగా స్కోర్ సాధించే సత్తా టీమ్‌ఇండియా బ్యాటింగ్ లైనప్‌కు ఉంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ విధానం బాగుంది. దూకుడుతో ఆధిపత్యం చెలాయించింది. భారత బౌలింగ్ బాగోలేదు. కోహ్లీ ఇప్పుడు అత్యుత్తమ బౌలర్లతో బౌలింగ్ చేయించాలి."
-మైఖేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్
పుణె వేదికగా జరిగిన డే/నైట్ వన్డేలో టీమ్‌ఇండియా తొలుత బ్యాటింగ్ చేసి 336/6 భారీ స్కోర్ సాధించింది. తొలి 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసిన భారత్.. 40 ఓవర్లకు 210/3తో నిలిచింది. ఈ క్రమంలోనే చివరి 10 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 126 పరుగులు సాధించింది. ఆదిలో శిఖర్ ధావన్(4), రోహిత్ శర్మ(25) విఫలమైన నేపథ్యంలో కోహ్లీ(66), కేఎల్ రాహుల్(108) జాగ్రత్తగా ఆడారు. ఇక 32వ ఓవర్ చివరి బంతికి కోహ్లీ ఔటైన తర్వాత కూడా టీమ్‌ఇండియా బ్యాటింగ్ శైలిలో మార్పు రాలేదు. రాహుల్‌తో జోడీ కట్టిన పంత్(77) తొలుత కాస్త నిదానంగా ఆడాడు. అలా 40 ఓవర్ల వరకు స్కోరుబోర్డు నెమ్మదిగా సాగింది. ఆపై పంత్, హార్దిక్ పాండ్యా(35) సిక్సర్లతో చెలరేగడం వల్ల జట్టు స్కోర్ పరుగులు పెట్టింది. ఈ నేపథ్యంలోనే టీమ్‌ఇండియా అతిజాగ్రత్త బ్యాటింగ్ పద్ధతిపై వాన్ విమర్శలు గుప్పించాడు.