16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా అసాధ్యాలను సుసాధ్యం చేశాడు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఈ క్రమంలోనే అతడి ఖాతాలో ఎన్నో రికార్డులు వచ్చి చేరాయి. ఐసీసీ టోర్నీలు అన్నింటిలో విజయవంతమైన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఈతరం క్రికెటర్లకు ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. నేడు (జులై 7) ధోనీ పుట్టినరోజు సందర్భంగా అతని జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.
వ్యక్తిగతం
మహేంద్రసింగ్ ధోనీ.. 1981 జులై 7న ఉమ్మడి బిహార్ రాష్ట్రంలోని రాంచీలో జన్మించాడు. టీమ్ఇండియాలో వికెట్ కీపర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా అడుగుపెట్టిన ధోనీ.. అనతి కాలంలోనే జట్టులో కీలకపాత్ర పోషించాడు. 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే ద్వారా క్రికెట్లో అరంగేట్రం చేసి.. ఆ తర్వాతి సంవత్సరం శ్రీలంకతో జరిగిన టెస్టుతో అపరిమిత ఓవర్ల ఫార్మాట్లో అడుగుపెట్టాడు. 2010లో సాక్షిని వివాహమాడాడు.
ఆపద్భాంధవుడు ధోనీ...
బ్యాటింగ్ చేయగల వికెట్ కీపర్ దొరక్క రాహుల్ ద్రవిడ్‌పై అదనపు భారం మోపి లాక్కొస్తున్న రోజులవి. పార్థివ్ పటేల్, అజయ్ రాత్రాల లాంటి వచ్చివెళ్లే వాళ్లు తప్ప స్థిరత్వం ఉన్న కీపర్ బ్యాట్స్‌మన్ దొరకడం లేదు. అలాంటి సమయంలో 2004లో టీమ్ఇండియా తలుపు తట్టాడు ధోనీ. కొద్దిరోజుల్లోనే నమ్మదగ్గ కీపర్‌గా, భరోసా ఉంచదగిన బ్యాట్స్‌మన్‌గా మారిపోయాడు. జట్టులోకి వచ్చిన మూడేళ్లలోపే సారథిగా మారి, దశాబ్దం పాటు ముందుండి నడిపించాడు.
వన్డేల్లో అత్యధిక స్టంపింగ్‌లు...
2004 డిసెంబర్ 23న తొలి వన్డే ఆడాడు ధోనీ. మొత్తం కెరీర్‌లో 350 వన్డేల్లో దాదాపు 51 సగటుతో 10,773 పరుగులు చేశాడు. అందులో 10 సెంచరీలు, 73 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 6 ఓవర్లు బౌలింగ్ చేసి, ఓ వికెట్ కూడా తీశాడు. ఈ ఫార్మాట్లో 321 క్యాచ్‌లు పట్టి, 123 స్టంపింగ్‌లు చేశాడు. వికెట్ల వెనుక అత్యంత చురుగ్గా ఉండే ఈ కీపర్.. 444 వికెట్లలో భాగస్వామ్యం పంచుకున్నాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక స్టంపింగ్‌ల రికార్డు ధోనీ పేరిటే ఉంది.
ఆ రికార్డు సాధించిన తొలి భారత కెప్టెన్
200 వన్డేలకు కెప్టెన్సీ వహించిన ధోనీ.. 110 విజయాలు ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా 100కు పైగా వన్డే మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించిన ఏకైక ఆస్ట్రేలియేతర సారథిగా చరిత్ర సృష్టించాడు. సచిన్ తర్వాత 10వేల పరుగుల మైలురాయి అందుకున్న 4వ భారతీయ క్రికెటర్, రెండో వికెట్ కీపర్‌గా నిలిచాడు.
ఏకైక బ్యాట్స్‌మన్ మహీనే
మొత్తం వన్డే కెరీర్‌లో 50 సగటుతో 10 వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ ధోనీ. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 4,031 పరుగులు చేశాడు. ఏడులో దిగి సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ స్థానంలోనే రెండు శతకాలు చేశాడు. వన్డేల్లో 82 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఫార్మాట్లో 200 సిక్స్‌లు బాదిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా అవతరించాడు.
అదే అత్యుత్తమ భాగస్వామ్యం
2005లో శ్రీలంకపై ధోనీ చేసిన 183 పరుగులు ఓ వికెట్ కీపర్‌కు అత్యధిక పరుగులు. అదే జట్టుపై ధోనీ- భువనేశ్వర్.. 8వ వికెట్‌కు నెలకొల్పిన 100 పరుగుల భాగస్వామ్యమే ఆ వికెట్‌కు భారత్ తరఫున అత్యధికం.
వికెట్ కీపర్.. 200 వన్డేలకు సారథ్యం
ఓ వికెట్ కీపర్ దాదాపు 200 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన రికార్డు ధోనీదే. ఒకే ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లలో భాగస్వామ్యంతో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. మహీ కెప్టెన్సీలోనే భారత్.. 2011 వన్డే ప్రపంచ విజేతగా నిలిచింది. 2015 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరింది.
సొంతగడ్డపై ఎక్కువ.. విదేశాల్లో తక్కువ
2005 డిసెంబర్ 2న టెస్టు అరంగేట్రం చేశాడు ధోనీ. తన పదేళ్ల కెరీర్‌లో 90 టెస్టులు ఆడాడు. 4 వేల 876 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో అతడి అత్యధిక స్కోరు 224. 60 టెస్టుల్లో కెప్టెన్‌గా 27 విజయాలు అందించాడు. 15మ్యాచ్‌లు డ్రాగా ముగిస్తే, 18 మ్యాచ్‌ల్లో భారత్ ఓడింది.
2009లో ధోనీ ఉన్నప్పుడే భారత్.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానం సంపాదించింది. సొంతగడ్డపై ఎక్కువ విజయాలు అందుకున్నాడు. విదేశాల్లో మాత్రం అత్యధిక పరాజయాలు మూటగట్టుకున్న టీమ్ఇండియా సారథిగా నిలిచాడు. టెస్టుల్లో 4వేల పరుగులు చేసిన తొలి భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ధోనీనే. ఈ ఫార్మాట్లో 38 స్టంపింగులు చేశాడు మహీ. టెస్టుల్లో ఇదే అత్యధికం.
బయోపిక్
'ధోని: అన్‌టోల్డ్ స్టోరీ' పేరుతో ధోని బయోపిక్ తెరకెక్కింది. బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. 2016 సెప్టెంబరు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో ధోనీ పాత్రలో హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించగా.. అతని భార్య సాక్షి పాత్రను నటి కియారా అడ్వాణీ పోషించింది. ధోనీని మరిపించే విధంగా అతని స్టైల్ నుంచి ఆడే ఆటతీరు వరకు అచ్చం మహీలా తెరపై మెప్పించడంలో సుశాంత్ నూటికి నూరు శాతం విజయం సాధించాడు.
వికెట్ కీపింగ్‌లో ధోనీ ఓ నమూనా
2006లో తొలి అంతర్జాతీయ టీ20 ఆడాడు ధోని. మొత్తంగా 98 టీ20ల్లో 1,617 పరుగులు చేశాడు. 73 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అందులో 41 విజయాలు, 28 అపజయాలు ఉన్నాయి.
అయితే వికెట్ కీపింగ్‌లో ధోనీ.. క్రికెట్ ప్రపంచానికి ఓ నమూనాగా నిలిచాడని ఇంగ్లండ్ క్రికెటర్లు బట్లర్, స్టోక్స్ చెప్పడం అతడి ప్రతిభకు నిదర్శనం. ఆరు టీ20 ప్రపంచకప్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించిన మహీ.. 2007లో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు.
ప్రస్తుతం
గతేడాది జరిగిన ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్ ధోనీ ఆడిన చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఆ తర్వాత ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. ఐపీఎల్ 13వ సీజనలో పాల్గొని తిరిగి జట్టులో చోటు దక్కించుకోవాలనుకున్నాడు. కానీ కరోనా ప్రభావంతో ఈ టోర్నీ నిరవధిక వాయిదా పడింది. అయితే దీనిని సెప్టెంబరు-నవంబరు మధ్య కాలంలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.
ఇదీ చూడండి... ధోనీ బైక్‌ల కలెక్షన్ ఎప్పుడైనా చూశారా?