తిరుగులేని కెప్టెన్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మేటి బ్యాట్స్‌మన్.. అత్యుత్తమ ఫినిషర్.. గొప్ప వికెట్‌కీపర్.. ఆటలో ఏ కోణంలో చూసినా ధోనీకి ధోనీయే సాటి! క్రికెట్లో అతడి ఘనతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! అయితే ధోనీ అంటే అంతేనా? ఎంత మాత్రం కాదు! కేవలం క్రికెటర్ గానే కాదు.. వ్యక్తిగానూ ఓ ఆదర్శప్రాయుడు! తనకే సొంతమైన వ్యక్తిత్వంతో అతడు వేసిన ముద్ర ప్రత్యేకమైంది! ఓ విద్యార్థి కావచ్చు.. ఉద్యోగికావచ్చు.. వ్యాపారి కావచ్చు.. ఏ రంగానికి చెందిన వాళ్లయినా అనుసరించడానికి ధోనీ వేసిన పాదముద్రలు చాలానే ఉన్నాయ్!
మనసు మాట విను..
ఆటగాడిగా ఎదగాలనో.. సినిమాల్లో వెలిగిపోవాలనో.. స్టార్టప్ పెట్టి రుజువు చేసుకోవాలనో ఉంటుంది. అప్పుడే ఉద్యోగం తలుపు తడుతుంది. జీవితానికి 'భద్రత' ఉంటుంది, వదిలిపెట్టొద్దంటారు తల్లిదండ్రులు. వాళ్లు చెప్పింది నిజమే! కానీ అందులో చేరితే జేబు నిండినా.. మనసు నిండదు! అది నీ లక్ష్యం వైపు అడుగులెయ్ అంటుంది! ధోనీకి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ధోనీ.. ఓ దశలో క్రికెట్‌ను పక్కన పెట్టి రైల్వే టీటీఈగా చేరాల్సి వచ్చింది. అందులో ఇమడలేకపోయాడు. ఇది కాదు తన జీవితం అనిపించింది! వదిలిపెట్టి క్రికెట్లోకే వచ్చేశాడు. తర్వాతి కథ ఓ చరిత్ర. ధోనీలా ప్రతి ఒక్కరికీ నచ్చిన రంగంలో అవకాశాలు రాకపోవచ్చు, విజయవంతం కాకపోవచ్చు. కానీ నీలో జ్వలించే కాంక్ష ఉన్నపుడు మనసు మాట విని సాగిపోవాలన్నది ధోనీ జీవితం చెప్పే పాఠం!
పెద్ద కల.. కంటే తప్పేంటి?
దేశంలో బాగా వెనుకబడ్డ రాష్ట్రాల్లో ఒకటైన ఝార్ఖండ్ నుంచి వచ్చాడు ధోనీ. అతడి తండ్రి ఓ ఇంజినీరింగ్ సంస్థలో చిరుద్యోగి. తల్లి గృహిణి. మధ్య తరగతి కుటుంబానికి చెందిన అతడు.. సామాన్య జీవితమే గడిపాడు. అయితే అతడి కల మాత్రం అంత సామాన్యమైంది కాదు! అంతర్జాతీయ క్రికెటర్ అవుతానంటే ఎంతమంది నవ్వారో! తేలిగ్గా తీసిపడేశారో! మన నేపథ్యాన్ని చూసుకుని మనకు మనం సంకెళ్లు వేసుకోకూడదు, ఏ స్థాయి నుంచి వచ్చినా.. పెద్ద కలలు కని వాటిని నెరవేర్చుకునే దిశగా సంకల్పంతో అడుగులేస్తే సాధించలేనిది ఏమీ లేదని చెప్పడానికి ధోనీయే ఉదాహరణ. దేశంలో కోట్లాదిమంది యువత ధోనీలో తమను చూసుకోవడానికి, స్ఫూర్తి పొందడానికి అతి సామాన్యమైన అతడి నేపథ్యం ఓ ముఖ్య కారణం.
చిన్ని చిన్ని ఆశ..
మ్యాచ్ ముగిసిందా.. ఎవ్వరికీ కనిపించకుండా మాయం అయిపోతాడు మహీ. అతడివన్నీ చిన్ని చిన్ని ఆనందాలు! విమానాలు కొనుక్కునే స్థాయిలో ఉన్నా.. అతడికి బైకుల మీద మోజు తీరలేదు. అందుకోసం ఓ గ్యారేజీనే ఏర్పాటు చేసుకున్నాడు. అందులో బైకులు రిపేర్ చేసుకుంటాడు. ప్రయోగాలు చేస్తాడు. హెల్మెట్ పెట్టుకుని ఒక్కడే రాంచీలో ఓ రౌండేసి వస్తాడు. ఇక తన కూతురితో మహీ చేసే అల్లరి అంతా ఇంతా కాదు! ట్రాఫిక్‌లో కారు ఆగినపుడు పక్కనున్న చిన్నారిని పలకరిస్తాడు. ఐపీఎల్ కోసం చెన్నై వెళ్లినపుడు తమిళ పాటలకు స్టెప్పులేస్తాడు. మ్యాచ్‌లు అయ్యాక సహచరులతో ధోనీ ఆటల గురించీ తెలిసిందే! ఏ స్థాయికి చేరుకున్నా జీవితంలో చిన్న చిన్న ఆనందాల్ని కోల్పోకూడదని.. మన హోదాను పక్కన పెట్టి మనసుకు నచ్చింది చేయాలని, జీవితాన్ని ఆస్వాదించాలని ధోనీని చూస్తే అర్థమవుతుంది.
నమ్మండి.. నడిపించండి
సాధారణంగా కనిపించే ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపి అద్భుతాలు చేయించడమే మహీ లక్షణం. జడేజాను ఇలాగే అతను వెలుగులోకి తెచ్చాడు. అతడిని జట్టులోకి తీసుకునే విషయంలో మొదట్లో విమర్శలు వచ్చినా.. అవకాశాలు కల్పిస్తూ రాటుదేలేలా చేశాడు. కెరీర్ ముగిసిందనుకున్న రాయుడిని చెన్నై జట్టులోకి తీసుకుని అతణ్ని ఓ ఐపీఎల్ సీజన్లో ఎలా హీరోను చేశాడో చూశాం. చెన్నై జట్టులో ధోనీ నాయకత్వంలో మెరుపులు మెరిపించారు. చెన్నైను వీడాక అదే ఆటగాళ్లు లయ తప్పారు. సహచరులకు, మనకింద పనిచేసే వాళ్లకు తగిన ప్రోత్సాహం అందిస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి గొప్ప పనితనాన్ని చూపిస్తారని, అద్భుతాలు చేస్తారని చెప్పడానికి ధోనీ చూపిన మార్గం రుజువు.
కష్టానికి ముందు.. పొగడ్తలకు వెనుక!
మ్యాచ్ పోయిందా.. విలేకరుల సమావేశంలో ధోనీ కచ్చితంగా కనిపిస్తాడు. మీడియా వాగ్బాణాల్ని ఎదుర్కొంటాడు. ఇబ్బందికర ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇస్తాడు. ఘోర పరాజయాలు ఎదురైనపుడు బాధ్యత తనదే అంటాడు. జట్టు కోసం అతనెంత కష్టపడతాడో, ఎంత నిబద్ధతతో ఆడతాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే జట్టు గెలిచినపుడు అంతా నా ఘనతే అంటూ ధోనీ ముందుకు రావడం ఎప్పుడూ చూసి ఉండం! కెప్టెన్‌గా 2007 టీ20 ప్రపంచకప్ గెలిచినపుడు ధోనీ కుర్రాడే. అప్పుడు అతడేమీ ఎగిరెగిరి పడలేదు. కప్పుతో సంబరాలు చేసుకోలేదు. దాన్ని జూనియర్ల చేతికిచ్చి పక్కకు వెళ్లిపోయాడు. 2011 ప్రపంచకప్ సమయంలోనూ అంతే! ఈ స్థితప్రజ్ఞత దర్శకుడు రాజమౌళిని సైతం అబ్బురపరిచి.. 'ఎం.ఎస్.ధోని' సినిమా వేడుకలో మహీని ప్రశంసల్లో ముంచెత్తాడు. నాయకుడనేవాడు కష్టానికి ముందుండాలని, పొగడ్తలకు వెనుక ఉండాలని ధోనీ ఎన్నోసార్లు చెప్పకనే చెప్పాడు.