టీమిండియాలో ఓపెనర్ స్థానం కోసం పోటీ పడుతోన్న కేఎల్ రాహుల్.. ఇటీవల విండీస్ పర్యటనలో పూర్తిగా విఫలమయ్యాడు. టెస్టుల్లో రోహిత్‌శర్మ బదులు ఇతడికి తుది జట్టులో చోటు దక్కినా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. టెస్టుల్లో ఈ క్రికెటర్ శతకం బాది దాదాపు ఏడాదవుతోంది. రాహుల్ ఫామ్‌పై తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు మాజీలు గంగూలీ, లక్ష్మణ్.
" టెస్టు క్రికెట్లో రోహిత్‌కు అవకాశం ఇవ్వాలి. అతడికి ఛాన్స్ వస్తే కచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాడన్న నమ్మకం ఉంది. ప్రపంచకప్‌లో సత్తా నిరూపించుకున్నాడు. రహానే, హనుమ విహారీతో కలిసి మంచి ఇన్నింగ్స్ నిర్మించగలడు. రాహుల్ బదులు హిట్‌మ్యాన్‌ను ఓపెనింగ్ బ్యాటింగ్‌కు పంపించాలి ".
- గంగూలీ, మాజీ క్రికెటర్
రాహుల్ టెస్టు ప్రదర్శనపై ఆందోళన వ్యక్తం చేశాడు మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్. కేఎల్ కొత్త ఆటగాడు కాదని మంచి అనభవమున్నా విఫలమవుతున్నాడని అభిప్రాయపడ్డాడు.
" కేఎల్ రాహుల్ ఫామ్‌పై ఆందోళనగా ఉంది. అతని సామర్థ్యాన్ని ప్రశ్నించాల్సిన పనిలేదు. ఈ ఆటగాడు టెస్టు క్రికెట్‌లోకి కొత్తగా ఏమీ రాలేదు. ఇప్పటికే అనేక అవకాశాలను పొందాడు. అయినా సరే అతడు వరుసగా విఫలమవుతున్నాడు".
- వీవీఎస్ లక్ష్మణ్, భారత మాజీ క్రికెటర్
ఆంటిగ్వా వేదికగా జరిగిన తొలి టెస్టులో కేఎల్ రాహుల్ 44, 38 పరుగులు చేశాడు. జమైకాలో జరిగిన రెండో టెస్టులోనూ పేలవ ప్రదర్శన కనబర్చాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 13, 6 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు.
భవిష్యత్తుపై ప్రభావం...!
సఫారీ జట్టు సెప్టెంబరులో టీమిండియా పర్యటనకు రానుంది. మూడు టీ20, మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి ఇరుజట్లు. తొలి టెస్టు అక్టోబర్ 2న ప్రారంభం కానుంది. అయితే వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఓపెనర్ రోహిత్ శర్మ... ఈ సిరీస్ టెస్టు మ్యాచ్‌ల్లో రాహుల్ స్థానం భర్తీ చేసే అవకాశముంది. శిఖర్ ధావన్, మురళీ విజయ్ కూడా ఈ రేసులో ఉన్నారు.
ఇదీ చూడండి...ఖడ్గమృగాల సంరక్షణకు రోహిత్‌శర్మ పిలుపు