టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ లాంటి ఫినిషర్.. తమ జట్టుకు అవసరమని అన్నాడు ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్. మిడిలార్డర్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఆటగాళ్లు పోటీ పడాలని సూచించాడు.
"గతంలో ఆసీస్ జట్టుకు మైక్ హస్సీ, మైకేల్ బెవాన్ లాంటి ఫినిషర్లు మ్యాచ్ ముగించే బాధ్యతను తీసుకునేవారు. ఇప్పుడు ఇంగ్లండ్‌కు బట్లర్.. ఆ పని చేస్తున్నాడు. ఈ విషయంలో ధోనీ అయితే మాస్టర్ లాంటివాడు. అలాంటి వాడు ప్రస్తుతం మా జట్టుకు కావాలి."
-జస్టిన్ లాంగర్, ఆస్ట్రేలియా కోచ్
ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆసీస్ జట్టు నిరాశపరిచింది. 0-3 తేడాతో వైట్‌వాష్‌కు గురైంది. ఈనెల 13 నుంచి న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఫినిషర్ స్థానాన్ని, జట్టులోని బ్యాట్స్‌మెన్ చేజిక్కుంచుకోవాలని లాంగర్ అభిప్రాయపడ్డాడు.
గత సంవత్సర కాలంలో ఆస్ట్రేలియా జట్టులోని 4-7 స్థానాల్లో 13 బ్యాట్స్‌మెన్ ఆడారు. ఆరో స్థానంలో 9 మందిని పరీక్షించారు. కానీ వారిలో మ్యాక్స్‌వెల్ పర్వాలేదనిపించినా, స్టాయినిస్ తీవ్రంగా నిరాశపరిచాడు. నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు.