2001లో విడుదలైన ఆమిర్‌ఖాన్ లగాన్ చిత్రం ఇప్పటికీ ఓ సంచలనమే. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా పల్లెటూరు యువకులు ధోతీ కుర్తాలోనే క్రికెట్ ఆడి, బ్రిటీష్ వారిని ఓడిస్తారు. అచ్చం అలాంటి వస్త్రధారణలోనే క్రికెట్ ఆడారు విద్యార్థులు.
బిహార్ దర్బంగాలోని కామేశ్వర్ సింగ్ దర్బంగా సంస్కృత విశ్వవిద్యాలయం ఈ ప్రత్యేక మ్యాచ్‌కు వేదికైంది. విద్యార్థులు ధోతీ-కుర్తా ధరించి మైదానంలోకి దిగి అదరగొట్టేశారు.
ఆటగాళ్లు సునాయాసంగా బంతిని బౌండరీలు దాటించేశారు. రన్నింగ్ కామెంట్రీ కూడా ప్రత్యేకమే. మైక్ పట్టుకున్న ఓ విద్యార్థి ఆట వివరాలను సంస్కృత భాషలో అనర్గళంగా చెప్పేశాడు. ఈ దృశ్యాలు భారతీయ సంస్కృతిని కళ్లకు కట్టాయి.
"ధోతీ కట్టుకుని క్రికెట్ ఆడడం, సంస్కృతంలో కామెంట్రీ చెప్పడం ప్రారంభించాం. మన వేషధారణను కోల్పోకుండా, మన సంస్కృతిని కాపాడేందుకే ఇలా చేస్తున్నాం. ఉదాహరణకు లగాన్ చిత్రంలో ఆమిర్‌ఖాన్ ధోతీలోనే క్రికెట్ ఆడాడు. అలాగే మేము సంప్రదాయాన్ని కాపాడుతూ ముందుకుసాగుతున్నాం. "
-విద్యార్థి
మన సంప్రదాయ వస్త్రధారణ, సంస్కృత భాషను పరిరక్షించుకుంటూ, ప్రపంచానికి సందేశం ఇవ్వాలనుకుంటున్నాం. అందుకే ఇక్కడి విద్యార్థులు
"భారతీయ వేషధారణలో, సంస్కృతంలో కామెంట్రీతో క్రికెట్ ఆడుతున్నారు. జనాలకు ఇది విచిత్రంగా అనిపిస్తోంది. సంస్కృతం అంటే గ్రాంథికమని, అది అందరూ మాట్లాడలేరని అనుకుంటారు. కానీ... ఇక్కడ ఆ భాషలో అనర్గళంగా కామెంట్రీ చెబుతున్నారు. ఇంతకు మించి ఏం కావాలి?"
-ప్రొ. సర్వనారాయణ్ ఝా, విశ్వవిద్యాలయం వీసీ
ఇదీ చూడండి:వైద్యుడిని కొట్టి చంపిన రోగి బంధువులు!