ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ ముందుంటాడు. అతడు ఆటతో దేశానికి తెస్తున్న పేరును గుర్తించి.. సత్కారం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది దిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ). కోట్లా మైదానంలోని ఓ స్టాండ్‌కు విరాట్ పేరు పెట్టనుంది.
"ప్రపంచ క్రికెట్లో కోహ్లీ చూపిస్తోన్న అసమాన ప్రతిభ అమోఘం. డీడీసీఏ ఈ విషయంపై చాలా ఆనందంగా ఉంది. విరాట్ ఎన్నో మైలురాళ్లు ఛేదించాడు. అతడి సారథ్య బాధ్యతలు సూపర్. విరాట్ ప్రతిభను మెచ్చుకుంటూ మైదానంలోని ఓ స్టాండ్‌కు కోహ్లీ పేరు పెడుతున్నాం. ఇది యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆశిస్తున్నాం."
-- రజత్ శర్మ, డీడీసీఏ ప్రెసిడెంట్
సెప్టెంబర్ 12న జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా.. భారత జట్టును సత్కరించనుంది దిల్లీ క్రికెట్ అసోసియేషన్.
గతంలో భారత మాజీ క్రికెటర్లు, దిల్లీ క్రీడాకారులైన బిషన్ సింగ్, మొహిందర్ అమర్నాథ్కు ఇదే విధంగా గౌరవం దక్కింది. వీరేందర్ సెహ్వాగ్, అంజుమ్ చోప్రాల పేర్లను మైదానంలోని స్వాగత ద్వారాలకు పెట్టిందీ సంఘం.