కరోనా కారణంగా ఇన్నిరోజులు ఇంటికే పరిమితమైన క్రికెటర్లు ఇప్పుడిప్పుడే మైదానాల బాట పడుతున్నారు. సురక్షిత వాతావరణంలో మ్యాచ్‌లు నిర్వహించేందుకు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. అయితే ఇంగ్లాండ్ మాత్రం ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లను ముగించింది. ఈ సందర్బంగా ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇందులో టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ నెంబర్ వన్, రోహిత్ శర్మ రెండో ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.
కోహ్లీ 871, రోహిత్ 855 పాయింట్లతో ఉన్నారు. పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ 829 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా 719 పాయింట్లతో రెండో ర్యాంకులో కొనసాగుతుున్నాడు. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్డ్ అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బల్పరిన్ 4 స్థానాలు మెరుగుపర్చుకుని 42వ స్థానంలోకి వచ్చాడు. సౌథాంప్టన్‌లో జరిగిన చివరి వన్డేలో 113 పరుగులతో మెరిశాడు ఆండ్రూ. అలాగే ఇదే మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఇంగ్లీష్ సారథి ఇయాన్ మోర్గాన్ ఒక స్థానం ఎగబాకి 22వ స్థానానికి చేరాడు. 82 పరుగులు చేసిన బెయిర్‌స్టో 13వ ర్యాంకు వద్ద నిలిచాడు.
బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ 29వ స్థానం నుంచి 25కు చేరుకున్నాడు. ఈ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన డేవిడ్ విల్లే ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని 51వ ర్యాంకుకు చేరాడు.
అలాగే ఈ సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచి సూపర్ లీగ్‌లో 20 పాయింట్లను సాధించింది ఇంగ్లాండ్. ఐర్లాండ్ 10 పాయింట్లు దక్కించుకుంది.