అవకాశమిస్తే రాబోయే మూడు ఐసీసీ ప్రపంచకప్పుల్లోనూ తానే వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తానని టీమ్‌ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ చెప్పాడు. స్వతహాగా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అయిన రాహుల్‌కు దేశవాళీల్లో వికెట్ కీపింగ్ చేసిన అనుభవం ఉంది. ఐపీఎల్‌లోనూ ఆ బాధ్యతలు నిర్వర్తించాడు. రిషబ్ పంత్, సంజు శాంసన్ అవకాశాల్ని సద్వినియోగం చేసుకోని నేపథ్యంలో.. పరిమిత ఓవర్ల క్రికెట్లో రాహుల్‌ను వికెట్ కీపర్‌గా ఆడించి, మరో బ్యాట్స్‌మన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాల్ని భారత జట్టు పరిశీలిస్తోంది.
వచ్చే మూడేళ్లలో మూడు ప్రపంచకప్‌లు (రెండు టీ20, ఒక వన్డే) జరగనున్న నేపథ్యంలో ఈ టోర్నీల్లో వికెట్ కీపర్‌గా సేవలందించడానికి తనకు అభ్యంతరం లేదని రాహుల్ అంటున్నాడు.
"నేను ఇష్టపడే పని అది. ఆ పని నేను చేయగలిగితే జట్టు కూర్పులో వెసులుబాటు ఉంటుంది. కాబట్టి నాకు అవకాశమిస్తే జట్టు కోసం సంతోషంగా ఈ మూడు ప్రపంచకప్‌ల్లోనూ వికెట్ కీపింగ్ చేయడానికి సిద్ధం. జట్టు నా నుంచి ఏం ఆశించినా చేయడానికి సిద్ధం. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అయిదో స్థానంలో బ్యాటింగ్ చేశా. ఆ స్థానాన్ని కూడా ఆస్వాదించా. జట్టు కోసం ఏం చేయమన్నా సంతోషంగా చేస్తా."
- కేఎల్ రాహుల్, టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్
మాజీ వికెట్ కీపర్ ధోనీలా బ్యాట్స్‌మెన్ కదలికల్ని గమనిస్తూ స్పిన్నర్లకు సలహాలిస్తారా? అని రాహుల్‌ను అడిగితే.. "ధోని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఒక వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఎలా ఉండాలో అతను చూపించాడు. నాకు జట్టులోని స్పిన్నర్లు కుల్‌దీప్, చాహల్, జడేజాలతో మంచి స్నేహం ఉంది. నా అవగాహన మేరకు వాళ్లకు సలహాలివ్వడానికి ప్రయత్నిస్తాను" అని రాహుల్ చెప్పాడు.