వర్షాకాలం తర్వాత ఐపీఎల్ నిర్వహించాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే పలువురు బీసీసీఐ అధికారులు తెలిపారు. అయితే టోర్నీ కచ్చితంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమిన్స్. ఈ సీజన్ వేలంలో తనను కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ జరుగుతుందని ధీమాగా ఉందని అతడు వెల్లడించాడు.
"కోల్‌కతా ఫ్రాంఛైజీ అధికారితో మాట్లాడినప్పుడు.. ఈ ఏడాది టోర్నీ కచ్చితంగా జరుగుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. దాని కోసం నేను ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నా. కరోనా సంక్షోభం తర్వాత మైదానంలో అడుగుపెట్టడానికి ఇదో మార్గంగా ఉంటుంది. త్వరలోనే టీ20 ప్రపంచకప్ జరగబోతుండటం వల్ల ఐపీఎల్ మరింత ఉపయోగపడుతుంది".
- పాట్ కమిన్స్, ఆస్ట్రేలియా పేసర్
ఐపీఎల్ సీజన్-13 కోసం జరిగిన ఆటగాళ్ల వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్.. పాట్ కమిన్స్‌కు రూ.15.5 కోట్లకు దక్కించుకుంది.
28 తర్వాతే స్పష్టత
ఐపీఎల్‌ను సెప్టెంబరు 25 నుంచి నవంబరు 1 మధ్య నిర్వహించే అవకాశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి చర్చిస్తోంది. ఈ నెల 28న టీ20 ప్రపంచకప్ నిర్వహణపై జరగనున్న ఐసీసీ సమావేశం తర్వాత ఐపీఎల్‌పై పూర్తి స్పష్టత రానుంది.
ఇదీ చూడండి.. 'బుమ్రాను తీసుకుందామని కోహ్లీకి చెప్పా'