న్యూజిలాండ్- బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న టెస్ట్ మ్యాచ్‌లో కివీస్ అత్యధిక స్కోరు నమోదు చేసింది. 6 వికెట్ల నష్టానికి 715 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మొదట బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లా జట్టు 234 పరుగులకు ఆలౌట్ అయింది.
అనంతరం బరిలోకి దిగిన కివీస్ జట్టుకు శుభారంభం దక్కింది. జీత్ రావల్(132), టామ్ లాథమ్(161) భారీ శతకాలతో అదరగొట్టారు. కేన్ విలియమ్సన్ ధాటికి స్కోరు బోర్డు దూసుకెళ్లింది. 257 బంతుల్లోనే ద్విశతకం పూర్తి చేసి జట్టుకు రికార్డు స్కోరుని అందించాడు. చివర్లో గ్రాండ్‌హోమ్ వేగంగా ఆడి అర్ధశతకంతో మెరిశాడు. 53 బంతుల్లోనే 76 పరుగులతో ధాటిగా ఆడాడు.
టెస్టుల్లో కివీస్ జట్టుకిదే అత్యుత్తమ స్కోరు. గతంలో పాకిస్థాన్‌తో 690 పరుగుల చేసిన కివీస్ జట్టు తాజా ప్రదర్శనతో ఆ రికార్డుని అధిగమించింది. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో తమీమ్ ఇక్బాల్(124) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. బంగ్లా 234 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ బౌలర్ నీల్ వాగ్నర్ 5 వికెట్లతో బంగ్లా ఇన్నింగ్స్‌ని శాసించాడు.
రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 307 పరుగుల వెనుకంజలో ఉంది బంగ్లా జట్టు.