TG State Consumer Commission : ద్విచక్ర వాహనం కొనుగోలు సమయంలో తీసుకున్న బీమా పాలసీ ప్రకారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి బీమా సొమ్ము రూ.15 లక్షలు, పరిహారం కింద రూ.50 వేలతో పాటుగా ఖర్చుల కింద రూ.50 వేలు చెల్లించాలంటూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌కు గురువారం ఆదేశాలు జారీ చేసింది. వెంకటస్వామి అనే వ్యక్తి 2020వ సంవత్సరంలో ఓ ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేసి రూ.15 లక్షలకు ఇన్సురెన్స్ పాలసీ తీసుకున్నారు. తర్వాత కొద్ది రోజులకు 2021లో కారు ఢీకొని మృతిచెందారు.
పాలసీ ప్రకారం ఇన్సురెన్స్ కంపెనీ సొమ్ము చెల్లించకపోవడంతో మహబూబ్‌నగర్‌కు చెందిన మృతుడు వెంకటస్వామి భార్య కె.మణెమ్మ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ క్రమంలో జిల్లా కమిషన్ నోటీసులు జారీ చేసినా బీమా కంపెనీ వారు స్పందించలేదు. సంబంధిత రికార్డుల ఆధారంగా 7.5 శాతం వడ్డీతో రూ.15 లక్షల పాలసీ సొమ్ము, మానసిక వేదనకు గురి చేసినందుకు పరిహారంగా మరో రూ.50 వేలు, ఖర్చుల కింద రూ.50 వేలు చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ సదరు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఏకంగా రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో వారి తరఫున అప్పీలు దాఖలు చేసింది.
మారిన కంపెనీ కార్యాలయం : దీనిపై కమిషన్ ఇన్‌ఛార్జి అధ్యక్షురాలు మీనా రామనాథన్, వి.వి.శేషుబాబులతో కూడిన ధర్మాసనం తక్షణమే న్యాయ విచారణ చేపట్టింది. ఇన్సురెన్స్ కంపెనీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ మధ్యే కంపెనీ కార్యాలయం మారినందున నోటీసు అందలేదని తెలిపారు. తమ వివరణ తీసుకోకుండానే జిల్లా కమిషన్ ఏకపక్షంగా ఉత్తర్వులిచ్చినట్లు పేర్కొన్నారు. బైక్ నడుపుతున్నప్పుడు మృతుడికి రవాణా చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు.
వాదనలు విన్న ధర్మాసనం డ్రైవింగ్ లైసెన్సుకు సంబంధించి ఇన్సురెన్స్ కంపెనీ ఆర్టీఏ అధికారులను సంప్రదించడం, లేదంటే అఫిడవిట్ పొందడంతో ధ్రువీకరించడం గానీ చేయలేదని తెలిపింది. జిల్లా కమిషన్ వెలువరించిన తీర్పులో జోక్యం చేసుకోలేమని అప్పీలును కొట్టివేసిన రాష్ట్ర వినియోగదారుల కమిషన్ బీమా సొమ్మును, పరిహారాన్ని బాధితులకు చెల్లించాలని ఆదేశించింది.
రూ.11.50 లక్షల 'రైతు బీమా' డబ్బులు స్వాహా - అమాయకపు రైతులను మోసం చేసిన ఏఈవో
లేడీస్‌కు గుడ్‌న్యూస్- 'LIC బీమా సఖి' అయ్యే ఛాన్స్- ట్రైనింగ్‌లో నెలకు రూ.7వేలు- నో ఏజ్ లిమిట్