Sabarimala Mandala Pooja Preparations : శబరిమల అయ్యప్ప మండల పూజకు సన్నాహాలు పూర్తైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఏడీఎం అరుణ్ నాయర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులకు ఏర్పాట్లపై సమీక్షించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జీఎస్‌వో ఉమేశ్ గోయల్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్ జీ విజయన్, శబరిమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బీ మురారి బాబు సహా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
మండల పూజ నేపథ్యంలో!
మండల పూజ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. నవంబరు 16న ప్రారంభమైన మండల పూజ సీజన్, డిసెంబరు 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజతో ముగియనుంది. ఈ క్రమంలో తొలుత అయ్యప్ప స్వామిని 'తంకా అంకి'తో అలంకరించిన తర్వాత, పవిత్రమైన బంగారు వస్త్రాన్ని ఉత్సవ ఊరేగింపుతో ఆలయానికి తీసుకొస్తారు. తర్వాత మండల పూజ నిర్వహిస్తారు.
భారీగా భక్తులు వచ్చే అవకాశం!
తంకా అంగీ దీపారాధన, మండల పూజ సందర్భంగా డిసెంబర్ 22 నుంచి అయ్యప్ప దర్శనానికి భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. విద్యాసంస్థలకు సెలవులు కావడం వల్ల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భక్తులు ప్రశాంతంగా అయ్యప్పను దర్శించుకునేలా ఏర్పాట్లు చేశాలని ఏడీఎం అధికారులను ఆదేశించారు.
"రానున్న రోజుల్లో శాఖల మధ్య సమన్వయం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. మండల పూజలు, తంకా అంగీ ఊరేగింపు సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ శాఖల ప్రతినిధులు బాగా పనిచేయాలి. చాలా అప్రమత్తంగా ఉండాలి. మండల పూజ, మకరవిళక్కు సమయంలో రద్దీని తగ్గించడానికి నిష్క్రమణ మార్గాలు అన్ని సమయాల్లో తెరిచి ఉంచాలి. అదనపు భద్రత కోసం సన్నిధానం వద్ద ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని మోహరించాలి. సన్నిధానం వద్ద మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధించాలి. ఈ నిబంధన అమల్లో ఉన్నా చాలా మంది ఉల్లంఘిస్తున్నారు. అందుకే పలు భాషల్లో ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు పెట్టాలి. రద్దీని దృష్టిలో ఉంచుకుని హోటళ్లలో గ్యాస్ సిలిండర్లను నిల్వ చేయకుండా నిరోధించాలి. అగ్నిమాపక దళం అన్ని సంస్థలకు హెచ్చరికలు జారీ చేస్తుంది" అని సన్నిధానం స్పెషల్ పోలీస్ అధికారి బీ కృష్ణకుమార్ తెలిపారు.
పలు శాఖలు తనిఖీలు
ఉద్యోగులు, కార్మికులు పొగాకు ఉత్పత్తులను ఉపయోగించకుండా ఉండేలా కఠినమైన తనిఖీలు కొనసాగుతాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. బుధవారం సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు వాడిన 22 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. చికెన్ పాక్స్ నివారణ మందుల పంపిణీ జరుగుతోందని హోమియోపతి శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు, 12వ మలుపు వద్ద లైటింగ్ సమస్యను పరిష్కరించినట్లు కేఎస్ఈబీ అసిస్టెంట్ ఇంజనీర్ పేర్కొన్నారు. వృద్ధులు, చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
'అన్నదానం కోసం డబ్బులు వసూలు చేయవద్దు'
మరోవైపు, మండల, మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ లో హాల్టింగ్ పాయింట్లు వద్ద అన్నదానం కోసం శబరిమల యాత్రికుల నుంచి ఎలాంటి డబ్బులు వసూలు చేయరాదని ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ)ని కేరళ హైకోర్టు ఆదేశించింది. తీర్థయాత్రల సీజన్లో టీడీబీ పరిధిలోని ఆలయాల్లో అన్నదానం పొందే యాత్రికుల నుంచి విరాళం వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఒక భక్తుడు చేసిన ఫిర్యాదు మేరకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తీర్థయాత్ర సమయంలో బోర్డు నిర్వహణలోని ఇతర దేవాలయాల వద్ద మరుగుదొడ్లు, అన్నదానం వంటి సరైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని టీడీబీని ఆదేశించింది.