టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాక ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అందరూ చెప్పుకునేట్టు టెస్టు క్రికెట్‌లో తాను అతడికి తొలి వికెట్ కాదని స్పష్టంచేశాడు.
"ధోనీ నాకు మంచి మిత్రుడు. అతడి కెరీర్ చాలా గొప్పగా సాగింది. అదొక మ్యాజికల్ కెరీర్ అని చెప్పొచ్చు. అలాంటి ఆట పట్ల గర్వంగా ఉండాలి. ధోనీ ఆట చూడటానికి భారత దేశంతో పాటు క్రికెట్ ప్రపంచం కూడా అదృష్టం చేసుకుంది. అయితే, ఇప్పుడు నీ క్రికెట్ కెరీర్ పూర్తయిన సందర్భంగా ఒక విషయం చెప్పాలి. లార్డ్స్ టెస్టులో నన్ను ఔట్ చేశావని, టెస్టుల్లో నేను నీకు తొలి వికెట్ అని.. నువ్వూ, నీ అభిమానులు నన్నెప్పుడూ అంటుంటారు. కానీ అది జరగలేదని నీకూ నాకు తెలుసు. నువ్వు రిటైర్మెంట్ ప్రకటించడం వల్ల ఈ విషయంపై స్పష్టతనిస్తున్నా. అదెప్పుడూ జరగలేదు. ఏదైమైనా అద్భుతమైన కెరీర్‌కు కంగ్రాట్స్. మా క్లబ్‌లోకి సుస్వాగతం."
-పీటర్సన్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్
జరిగింది ఇది
2011లో లార్డ్స్ మైదానం వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. ఇంగ్లాండ్ 217/3 స్కోర్ వద్ద పీటర్సన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో ధోనీ బౌలింగ్ చేయగా ఒక బంతిని ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేశాడు. అంపైర్ దాన్ని తిరస్కరించాడు. తర్వాత మరో బంతికి వికెట్ల వెనుక దొరికిపోయాడు పీటర్సన్. ధోనీతో పాటు అందరూ అప్పీల్ చేయగా అంపైర్ ఔటిచ్చాడు. దానికి పీటర్సన్ డీఆర్‌ఎస్‌కు వెళ్లడం వల్ల నాటౌట్‌గా తేలింది. అయినా, అప్పటి నుంచి ధోనీ, అతడి అభిమానులు పీటర్సన్‌ను పలు సందర్భాల్లో ఆటపట్టించారు. ధోనీకి టెస్టుల్లో అతడే తొలి వికెట్ అని సరదాగా అంటుంటారు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లీష్ మాజీ క్రికెటర్ స్పందిస్తూ ధోనీ తననెప్పుడూ ఔట్ చేయలేదని మరోసారి చెప్పుకొచ్చాడు.