ప్రస్తుత క్రికెట్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్.. అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని కివీస్ సారథి కేన్ విలియమ్సన్ అన్నాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో ఇటీవలే ఇన్‌స్టా లైవ్‌చాట్‌లో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పాడు. ఈ సందర్భంగా కోహ్లీ గురించి చెబుతూ, మూడు ఫార్మాట్లలోనూ కసితో పరుగులు తీస్తున్నాడని తెలిపాడు.
'అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒక్కర్ని ఎంచుకోమంటే చాలా కష్టం. ఏబీ డివిలియర్స్ ప్రస్తుతం లీగ్ మ్యాచ్‌లే ఆడుతున్నాడు. ఆ విషయం నాకూ తెలుసు. అయినా అతనో అత్యుత్తమ బ్యాట్స్‌మన్, గిఫ్టెడ్ ప్లేయర్లలో ఒకడు. మన తరంలో డివిలియర్స్ ఓ ప్రత్యేకమైన ఆటగాడు. అయితే, ఇంకా చాలా మంది నాణ్యమైన ఆటగాళ్లూ ఉన్నారు. విరాట్ కోహ్లీ గురించి చెప్పాలంటే.. మూడు విభాగాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. పరుగుల కోసం అతను చాలా కసిగా ఉన్నాడు. కోహ్లీ ఆటను చూడాలనిపిస్తుంది. అలాగే అతనితో ఆడాలనిపిస్తుంది. టీమిండియా కెప్టెన్ నుంచి నేర్చుకోవాల్సిందీ చాలా ఉంది' -విలియమ్సన్, కివీస్ కెప్టెన్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని క్రికెట్ మ్యాచ్‌లు నిలిచిపోయాయి. దీంతో ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సందర్భంగా లైవ్‌చాట్లలో పాల్గొంటూ అభిమానులను అలరిస్తున్నారు.