జస్ప్రీత్ బుమ్రా.. టీమిండియా పేస్ దళానికి సేనాని. ప్రపంచకప్‌లో అతడి సత్తా ఏంటో నిరూపించాడు. అతడి యార్కర్లను ఎదుర్కోవడానికి ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మన్ కూడా ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నం.. అలాంటి స్టార్ బౌలర్ వేసిన ఆఖరి ఓవర్లలో లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ పరుగులు పిండేసుకుంటున్నారు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 10 ఓవర్లు వేసిన జస్ప్రీత్... 60 పరుగులిచ్చి ఒక్క విక్కెట్ కూడా సాధించలేకపోయాడు.
మూడు వన్డేల్లో నిల్...
వెన్ను గాయం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన జస్ప్రీత్ వికెట్లు తీయడంలో ఇబ్బందులు పడుతున్నాడు. లైన్ అండ్ లెంగ్త్ తప్పుతూ.. భారీగా ఎక్స్‌ట్రాలు ఇచ్చుకుంటున్నాడు. తొలి వన్డేలో 13 వైడ్లు వేయడం ఆశ్చర్యం. ఆఖరిగా ఆడిన 5 వన్డేల్లో.. 1 వికెట్ మాత్రమే తీసి 5.13 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. వరుసగా మూడు వన్డేల్లో వికెట్లు తీయకుండా కెరీర్లో తొలిసారి ఓ చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు.
కివీస్ తోకతో కొట్టేశారు...
టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ను నియంత్రించినా.. లోయర్ ఆర్డర్‌ను ఔట్ చేయడంలో ఇప్పటికీ కష్టాలు ఎదుర్కొంటున్నారు భారత బౌలర్లు. ఆఖరి ఓవర్లలో పరుగుల నియంత్రణ టీమిండియాకు కష్టంగా మారింది. తాజా మ్యాచ్‌లో కివీస్ తోకను అడ్డుకునేందుకు టీమిండియా బౌలర్లు చేసిన ప్రయోగాలు విఫలమయ్యాయి. ఏకంగా తొమ్మిదో వికెట్ వద్ద 76 పరుగుల భాగస్వామ్యం సాధించారు టేలర్, జేమిసన్. ఫలితంగా ఆక్లాండ్ మైదానంలో ఈ వికెట్‌కు ఎక్కువ పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన జట్టుగా రికార్డునూ సొంతం చేసుకుంది.