వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌కు మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించిన ఐసీసీ... ఓ డీమెరిట్ పాయింట్‌నూ అతడి ఖాతాలో వేసింది. ఫ్లోరిడా వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో దుష్ప్రవర్తనకు పాల్పడడమే ఇందుకు కారణమని తెలిపింది.
" ఐసీసీ నియమావళిలోని నిబంధన 2.4ను పొలార్డ్ అతిక్రమించాడు. పోలార్డ్ ఆట మధ్యలో సబ్‌స్టిట్యూట్‌ను మైదానంలోకి పిలిచాడు. ఓవర్ పూర్తయ్యేవరకు ఆగాలని అంపైర్లు సూచించినా పట్టించుకోలేదు. వారి ఆదేశాలను బేఖాతరు చేసి నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించాం. మ్యాచ్ అనంతరం రిఫరీ జెఫ్ క్రో ముందు హాజరైన పొలార్డ్ తప్పును అంగీకరించలేదు. అతడి చర్యలకు శిక్షగా మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించాం. ఓ డీమెరిట్ పాయింట్ కూడా అతడి ఖాతాలో చేరుస్తున్నాం"
-- ఐసీసీ ప్రకటన
రెండు సంవత్సరాల కాలంలో ఎవరైనా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు పొందితే... వారిపై కొంత కాలం నిషేధం పడుతుంది. రెండు పాయింట్లు వస్తే ఒక టెస్టు/ రెండు వన్డేలు/ రెండు టీ20ల్లో వేటు పడుతుంది. నిషేధం ఎదుర్కొన్నా ఈ పాయింట్లను రెండేళ్ల పాటు అతడి ఖాతాలోనే ఉంచుతారు.
కరీబియన్ జట్టుపై రెండో టీ20లో విజయం సాధించిన భారత జట్టు 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 22 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా.
ఇది చదవండి: స్మిత్ రీఎంట్రీ హిట్‌పై సచిన్ రియాక్షన్