ఐపీఎల్లో ప్రదర్శనను బట్టే మహేంద్రసింగ్ ధోనీ భవిష్యత్ ఆధారపడి ఉందని అంటున్నాడు టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే. టీ20 ప్రపంచకప్‌లో ధోనీ అవసరం ఉందో లేదే జట్టు తేల్చుకోవాలని సూచించాడు.
"వచ్చే ఐపీఎల్ ప్రదర్శనతో పాటు.. ధోనీ అనుభవం జట్టుకు అవసరం అనుకుంటే అతడు తుదిజట్టులో ఉంటాడు. ప్రస్తుతం ఈ విషయంపై ఎదురుచూడాల్సిందే."
-కుంబ్లే, టీమిండియా మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో జరగబోతుంది కాబట్టి అక్కడి పరిస్థితుల్లో సత్తాచాటే ఆటగాళ్లను ఎంపికచేయాలని కుంబ్లే సూచించాడు.
"ఆస్ట్రేలియాలోని పిచ్‌లపై సత్తాచాటే ఆటగాళ్లపై దృష్టిసారించాలి. ముఖ్యంగా అక్కడ వికెట్లను రాబట్టగలిగే బౌలర్లను ఎంపికచేయాలి. మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్, చాహల్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. అలాగే ప్రపంచకప్ కంటే 10-12 మ్యాచ్‌ల ముందే జట్టును ఫైనల్ చేయాలి."
-కుంబ్లే, టీమిండియా మాజీ క్రికెటర్
2016-2017లో టీమిండియాకు కోచ్‌గా వ్యవహరించాడు అనిల్ కుంబ్లే. సారథితో పాటు ఆటగాళ్లతో విభేదాల కారణంగా కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు మెంటార్‌గా వ్యవహరించాడు. ఈ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కోచ్‌గా ఉండబోతున్నాడు.
ఇవీ చూడండి.. క్రీజు దాటితే మన్కడింగ్ చేస్తా: అశ్విన్