కరోనా మహమ్మారి ధాటికి కొన్ని నెలల పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలూ స్తంభించిపోయాయి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా కోలుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో క్రీడా రంగం కూడా ఒకటి. మళ్లీ ఆటలు ఆరంభించేందుకు వివిధ క్రీడల్లో సన్నాహాలు మొదలయ్యాయి. అన్నింట్లోకి నిర్వహణ పరంగా ఎక్కువ కష్టంతో కూడుకున్న క్రికెట్‌ను కూడా పునఃప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించాలంటే వందల మంది చేతులు కలిపితే తప్ప సాధ్యం కాని ఆట క్రికెట్. అయినా సరే.. కరోనా మహమ్మారిని అధిగమించి విజయవంతంగా మ్యాచ్‌లు నిర్వహించాలన్న పట్టుదలతో క్రికెట్ బోర్డులు సిద్ధమవుతున్నాయి. మరి కరోనాతో పోరులో క్రికెట్ గెలుస్తుందా?
ఇంకో నెల రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్ పునఃప్రారంభం కానుంది. జులై 8న ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ మొదలవుతుంది. ఈ సిరీస్‌కు ఆతిథ్యమివ్వనున్న ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు.. బయో సెక్యూర్ విధానంలో సురక్షితంగా సిరీస్‌ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. సిరీస్ ఆరంభానికి రెండు వారాల ముందే ఆటగాళ్లు క్వారంటైన్‌కు వెళ్లనున్నారు. మ్యాచ్ కోసం సాధ్యమైనంత తక్కువ మంది సిబ్బందిని వినియోగించనున్నారు. స్టేడియంకు సమీపంలోనే అందరికీ బస ఏర్పాటు చేయనుంది బోర్డు. ఆటగాళ్లతో పాటు మ్యాచ్ అధికారులు, సిబ్బంది కరోనా బారిన పడకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనుంది. ఈ సిరీస్ ఏ ఇబ్బందీ లేకుండా సాగితే.. మిగతా జట్లూ సిరీస్‌లకు సిద్ధమవుతాయి. భారత జట్టు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల్లో పర్యటిస్తుంది. ఐపీఎల్ కోసం కూడా సమాచాలోచనలు జరుగుతున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో కొంత కాలం పాటు క్రికెట్ భిన్నంగా ఉండబోతోందన్నది మాత్రం స్పష్టం.
షేక్‌హ్యాండ్స్ కాదు.. షేక్ లెగ్స్
వికెట్ పడగానే బౌలర్‌ను సహచరులు చుట్టుముట్టడం.. చేతులు చరుచుకోవడం.. భుజాలు తట్టడం.. కౌగిలించుకోవడం.. క్రికెట్లో సాధారణ దృశ్యాలు. మ్యాచ్ ఆరంభానికి ముందు, తర్వాత ప్రత్యర్థులతో కరచాలనాలు ఉంటాయి. అయితే కరోనా నేపథ్యంలో వీటన్నింటికీ కొంత కాలం బ్రేక్ పడనుంది. అయితే ప్రత్యర్థులతో మర్యాదపూర్వక పలకరింపునకైనా.. సహచరుల సంబరాలకైనా.. ఒకరి కాళ్లను ఒకరు తాకించడమే ప్రత్యామ్నాయం కాబోతోంది. ఇందుకోసం కొందరు మోచేతుల్ని కూడా ఉపయోగించే అవకాశముంది.
![shakehands](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7521502_asdf.jpg)
వచ్చామా.. ఆడామా..వెళ్లామా!
అంతర్జాతీయ క్రికెట్ అంటే.. కేవలం మ్యాచ్ ఆడటంతో సరిపోదు. మ్యాచ్‌కు ముందు కొన్ని రోజుల నుంచే స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేస్తారు. అక్కడే విలేకరుల సమావేశాలు పెడతారు. మ్యాచ్ రోజు ఆరంభ సమయానికి కొన్ని గంటల ముందే స్టేడియానికి చేరుకుంటారు. వార్మప్ చేస్తారు. ఆట ముగిశాక కామెంటేటర్లతో చర్చలు, విలేకరుల సమావేశాల్లాంటివి కూడా ఉంటాయి. ఇకపై కొన్ని నెలల పాటు ఇవన్నీ బంద్ అన్నట్లే. కరోనా ముప్పు నేపథ్యంలో ఆటగాళ్లు, మ్యాచ్ సిబ్బంది వీలైనంత తక్కువ సమయం స్టేడియంలో ఉండేలా జాగ్రత్త పడనున్నారు. మ్యాచ్ సమయానికి ఓ అరగంట ముందు రావడం.. ఆడటం.. వెంటనే సర్దుకుని బస్సెక్కడం, హోటల్‌కు చేరుకోవడం.. ఇలా ఉండబోతోంది వ్యవహారం.
కొత్త సబ్‌స్టిట్యూట్
క్రికెట్లో ఎవరైనా ఆటగాడు గాయపడితే అతడి స్థానంలో సబ్‌స్టిట్యూట్ వచ్చి ఫీల్డింగ్ చేయొచ్చు. అతడికి బౌలింగ్, బ్యాటింగ్ చేసే అవకాశముండదు. అయితే కొన్నేళ్ల కిందట 'కంకషన్ సబ్‌స్టిట్యూట్'ను ప్రవేశపెట్టారు. ఓ క్రికెటర్ తలకు గాయమై మైకం కమ్మినట్లుంటే.. అతడి స్థానంలో తుది జట్టులోకి వేరే ఆటగాణ్ని తీసుకోవచ్చు. అతను బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఇదే తరహాలో 'కరోనా సబ్‌స్టిట్యూట్'ను ప్రవేశ పెట్టబోతోంది ఐసీసీ. ఎవరైనా ఆటగాడు మ్యాచ్ మధ్యలో కరోనాతో ఆటకు దూరమైతే అతడి స్థానంలో మరొకరిని తీసుకోవచ్చు. అయితే ఇది టెస్టులకు మాత్రమే వర్తిస్తుంది.
అరుపుల్లేవ్.. కేకల్లేవ్
ఫోర్ కొడితే అరుపులు.. సిక్స్ కొడితే కేరింతలు.. వికెట్ తీస్తే గెంతులు.. క్రికెట్ స్టేడియాల్లో ఉండే వాతావరణమే వేరు. వీటికి ఆటగాళ్లు, అంపైర్లు, స్టేడియాల్లోని ప్రేక్షకులు, టీవీల్లో చూసే వీక్షకులు.. అందరూ అలవాటు పడిపోయారు.
అలాంటిది స్టేడియంలో ఒక్కరంటే ఒక్క ప్రేక్షకుడూ లేకుండా రెండు పెద్ద జట్లు తలపడటం అన్న ఊహే చాలా చిత్రంగా అనిపిస్తుంది. ప్రేక్షకుల గోల లేకుంటే మ్యాచ్ ఆడుతున్న, చూస్తున్న భావన ఉంటుందా అన్నది సందేహం. కిక్కిరిసిన స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడే స్టార్ క్రికెటర్లకు అదొక ప్రేరకంలా పని చేస్తుంది. మరి ఖాళీ స్టేడియాల్లో ఆడుతుంటే వారికెలా ఉంటుందో.. టీవీల్లో చూసే ప్రేక్షకుల సంగతేంటో?
ఇది చూడండి : 'అలాంటప్పుడు లాలాజలం వినియోగం సమస్యే కాదు'