ఐపీఎల్ 13వ సీజన్ నిర్వహణ తేదీలపై సందిగ్ధత కొనసాగుతోంది. వచ్చే నెల 29న సీజన్ ఆరంభమై మే 24న ముగుస్తుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ చూచాయిగా చెప్పాడు. ఈ తేదీలపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. అయితే ఎక్కువ మంది విదేశీ ఆటగాళ్లు ఏప్రిల్ ఒకటి తర్వాతే భారత్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆరంభ తేదీ మారే అవకాశం ఉన్నట్లు సమాచారం.
బీసీసీఐ నుంచి ఐసీసీ ప్రతినిధిగా ఎంపికైన జై షా.. ఐసీసీ సమావేశంలో పాల్గొన్న తర్వాతే ఈ తేదీల విషయంపై ఓ నిర్ణయం తీసుకునే వీలుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఆల్‌స్టార్స్ మ్యాచ్ అనుమానమే..
ఐపీఎల్ ప్రారంభానికి మూడు రోజుల ముందు నిర్వహించాలనుకున్న ఆల్‌స్టార్స్ మ్యాచ్ నిర్వహణ అనుమానంగా మారింది. సీజన్‌కు ముందు ఎనిమిది ఫ్రాంఛైజీల ఆటగాళ్లను.. రెండు జట్లుగా విడదీసి ఈ మ్యాచ్ నిర్వహిస్తామని గంగూలీ ఇదివరకే ప్రకటించాడు. అయితే ఆటగాళ్లను ఆ మ్యాచ్‌కు అనుమతించే విషయంపై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపట్లేనట్లు తెలుస్తోంది.
" వ్యాపార కోణంలో ఆలోచిస్తే మా జట్టు ఆటగాళ్లు మా జెర్సీ వేసుకోకపోవడం మాకు సమ్మతం కాదు. ఐపీఎల్ సీజన్ ఆరంభానికి కొన్ని రోజుల ముందు ఆల్‌స్టార్ మ్యాచ్ కోసం ఆటగాళ్లను వదిలేయమనడంలో అర్థం లేదు. క్రీడాకారులకు గాయాలయ్యే ప్రమాదముంది. జట్టుతో బంధం పెంచుకునే సెషన్స్, కలిసి ప్రయాణించే సమయాన్ని వాళ్లు కోల్పోతారు".
-- ఓ ఫ్రాంఛైజీ యజమాని
సీజన్ ముగిశాక ఈ మ్యాచ్ నిర్వహించే అవకాశాలనూ కొట్టిపారేయలేమని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.
ఐపీఎల్‌కు ఆర్చర్ దూరం
ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యాడు. కుడి మోచేతికి గాయం కావడం వల్ల అతను ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్న ఈ పేసర్.. శ్రీలంకతో పర్యటనకు కూడా దూరం అవుతున్నట్లు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.