ఒక్కసారి లోపలికి వెళితే పని పూర్తయ్యాకే వెలుపలికి. మధ్యలో బయటకు వెళ్లనివ్వరు. అనుమతి లేనిదే కొత్తవారిని లోపలికి రానివ్వరు. లోపల ఏం జరుగుతుందన్నది టీవీల్లో మాత్రమే చూడాలి! సరిగ్గా బిగ్‌బాస్ రియాల్టీ షోను తలపిస్తున్న ఈ సన్నివేశాలన్నీ మరికొన్ని రోజుల్లో ఐపీఎల్‌లో దర్శనమివ్వనున్నాయి. కరోనా మహమ్మారి నుంచి క్రికెటర్లు, అధికారులు, సిబ్బందిని సురక్షితంగా ఉంచడానికి కఠినమైన బయో బబుల్ నిబంధనల్ని ఐపీఎల్‌లోనూ బీసీసీఐ అమలు చేయనుంది.
యూఏఈ వేదికగా సెప్టెంబరు 19న ఆరంభంకానున్న ఐపీఎల్ కోసం బీసీసీఐ సన్నాహాలు మొదలుపెట్టింది. ప్రపంచం నలుమూలల నుంచి ఆటగాళ్లు, వ్యాఖ్యాతలు, అధికారులు, సిబ్బంది రానున్న నేపథ్యంలో బోర్డు కఠినమైన నిబంధనల్ని రూపొందించింది. ఇప్పటికే సిద్ధం చేసిన లీగ్ నిర్వహణ నియమావళిని అన్ని ఫ్రాంచైజీలకు అందించనుంది. ఆటగాళ్లు, ఫ్రాంచైజీల యజమానులంతా ఈ నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని బీసీసీఐ స్పష్టం చేయనుంది.
క్రికెటర్లకు కరోనా పరీక్షలు నిర్వహించడం.. డగౌట్‌లో సిబ్బంది సంఖ్యను తగ్గించడం.. డ్రెస్సింగ్ రూమ్‌ను 15 మంది ఆటగాళ్లకే పరిమితం చేయడం.. భౌతిక దూరం పాటిస్తూ మ్యాచ్ తర్వాత బహుమతి ప్రదానోత్సవం నిర్వహించడం నియమావళిలో పేర్కొన్న ముఖ్యమైన నిబంధనలు.
"ఒకసారి బయో బబుల్‌లోకి ప్రవేశించిన తర్వాత ఎవరూ బయటకు వెళ్లడానికి వీల్లేదు. మళ్లీ లోపలికి వచ్చేందుకు అవకాశం ఉండదు. ఆటగాళ్లతో పాటు వారి భార్యలు, కుటుంబ సభ్యుల ప్రయాణాలపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోదు. ఆ నిర్ణయం ఫ్రాంఛైజీలకే వదిలేసింది. అయితే ప్రతి ఒక్కరు నిబంధనలను పాటించాల్సిందే. బస్ డ్రైవర్‌తో సహా ఏ ఒక్కరు కూడా బుడగను వీడకూడదు. వచ్చే వారం సమావేశం తర్వాత పూర్తి వివరాల్ని ఫ్రాంచైజీలకు అందజేస్తాం. ఫ్రాంచైజీలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే బోర్డు చర్చిస్తుంది. లీగ్ నిర్వహణ నియమావళి ప్రకారం ప్రతి ఆటగాడు రెండు వారాల్లో నాలుగు సార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలి. భారత్‌లో రెండు సార్లు.. యూఏఈలో క్వారంటైన్‌లో ఉన్నప్పుడు మరో రెండు సార్లు పరీక్షలు నిర్వహిస్తారు’’ అని బీసీసీఐ అధికారి తెలిపారు.
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా ఇంగ్లాండ్ బోర్డు అవలంభించిన పద్ధతుల్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బీసీసీఐ ఈ నిబంధనలను రూపొందించింది.
అందరూ ఒకేసారి రావాలి
గతంలో ఐపీఎల్ జట్లకు ప్రాతినిధ్యం వహించే భారత ఆటగాళ్లు విడివిడిగా వచ్చేవాళ్లు. ఈసారి మాత్రం అలాంటి వెసులుబాటు లేదు. ఆటగాళ్లంతా ఒకేసారి బయో బబుల్‌లో అడుగుపెట్టాలి. ప్రతి జట్టులో 20, అంతకంటే ఎక్కువ మంది ఆటగాళ్లు ఉన్నారు. సహాయక సిబ్బంది అదనం. వీరందరి వసతి కోసం ప్రత్యేక మార్గదర్శకాలు పొందుపరిచారు. ఒక జట్టుకు కేటాయించిన హోటల్‌ను మార్చడం కుదరదు. కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వంట సిబ్బందిని మాత్రమే హోటళ్లు, డ్రెస్సింగ్ రూమ్‌లు, ఇతర ప్రాంతాల్లోకి బీసీసీఐ అనుమతిస్తుంది. మ్యాచ్ అధికారులు, ప్రసారదారుకు కూడా నియమావళిని బోర్డు అందజేస్తుంది.