గతంలో కంటే ప్రస్తుతం కరోనా వ్యాపిస్తున్న పరిస్థితుల్లో క్రికెట్ ఆడటం చాలా భిన్నమైందని అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్. ఐపీఎల్ వల్ల ఈ ఏడాది చివర్లో జరగబోయే బోర్డర్-గావస్కర్ ట్రోఫీకి భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లకు తగిన ప్రాక్టీసు లభించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డాడు.
"కరోనా కారణంగా మార్చి నుంచి కొన్ని సిరీస్ల నిర్వహణ సాధ్యం కాలేదు. విరామం తర్వాత క్రికెటర్ల ప్రాక్టీసు ఐపీఎల్ ఓ వరంగా మారింది. ఎందుకంటే దాదాపు ఆరు నెలలుగా క్రికెటర్లకు ఎలాంటి ప్రాక్టీసు లేదు. అందువల్ల డిసెంబరులో జరగబోయే బోర్డర్-గావస్కర్ ట్రోఫీకి ప్రాక్టీసుగా ఐపీఎల్ ఉపయోగపడుతుంది. కరోనా వ్యాపిస్తున్న క్రమంలో బయోబబుల్ ఏర్పాటు చేసి ఆటగాళ్లను నిరంతరం పర్యవేక్షించడం సులువైన పని కాదు. ప్రస్తుతం క్రికెటర్లందరికీ ఇదొక సవాలు వంటిది."
- ఇయాన్ చాపెల్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్
యూఏఈ వేదికగా ఐపీఎల్ ఈనెల 19 నుంచి నవంబరు 10 వరకు జరగనుంది. ఈ టోర్నీ పూర్తవ్వగానే ఆస్ట్రేలియా పర్యటనకు టీమ్ఇండియా వెళుతుంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా నాలుగు టెస్టులు ఆ తర్వాత మూడు వన్డేలు నిర్వహించనున్నారు.