ఈ ఏడాది ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడనున్న ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా డెత్ బౌలింగ్(చివరి ఓవర్లు)పై ప్రావీణ్యం సంపాదించాలని భావిస్తున్నాడు. ఇందుకోసం టీమ్ఇండియా బౌలర్ యుజ్వేంద్ర చాహల్తో భాగస్వామ్యం పంచుకోవాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు.
ఇటీవలే ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో డెత్ బౌలింగ్ ప్రణాళిక విజయవంతం కాకపోవడం వల్ల.. అందులో పట్టు సాధించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు జంపా తెలిపాడు. ఈ క్రమంలోనే ఆర్సీబీలో చాహల్తో కలిసి బౌలింగ్ చేయడం మంచి అవకాశంగా భావిస్తున్నట్లు వెల్లడించాడు.
అయితే లీగ్లో పదకొండు మంది సభ్యుల్లో జంపా స్థానం దక్కించుకోవడం సవాలుగా మారిందనే చెప్పాలి. జట్టులో అతనికి పోటీగా ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీతో పాటు వాషింగ్టన్ సుందర్, పవన్ నేగిలు ఉన్నారు. సెప్టెంబర్ 19న యూఏఈ వేదికగా ఐపీఎల్ మొదలుకానుంది. చెన్నై సూపర్ కింగ్స్-ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.