టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను ప్రశంసించాడు పాక్ మాజీ సారథి ఇంజిమామ్ ఉల్ హక్. తమ దేశ మాజీలు వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్‌లను యుక్త వయసులోనే ద్రవిడ్ ఎదుర్కొన్న తీరును మెచ్చుకున్నాడు. ఏదో సాధించేందుకే రాహుల్ క్రికెట్లోకి వచ్చాడని, తనకు అప్పుడే అనిపించినట్లు యూట్యూబ్ ఛానెల్లో వివరించాడు.
"1996లో కెనడాలో ఆడుతున్నప్పుడు తొలిసారి ద్రవిడ్‌ను చూశాను. 'ఈ అబ్బాయి చాలా బాగా ఆడతాడు' అని ఎవరో చెప్పినప్పుడు అతడిని చూడాలనుకున్నా. పేస్, స్వింగ్‌లతో బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించే అక్రమ్, యూనిస్ లాంటి బౌలర్లు మా జట్టులో ఉన్నారు. వాళ్ల పేర్లు చెబితేనే కుర్రాళ్లు జడుసుకుంటారు. అలాంటిది ఆత్మవిశ్వాసంతో ద్రవిడ్ వారిని ఎదుర్కొన్న తీరు ప్రశంసనీయం. అతడు ఎంతో ప్రత్యేకమని మాకు అప్పుడే అర్థమైంది"
- ఇంజిమామ్ ఉల్ హక్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్
అరౌండ్ ద వికెట్ బంతులని రాహుల్ సమర్థవంతంగా ఎదుర్కొన్న విధానాన్ని ఇంజిమామ్ మెచ్చుకున్నాడు.
"స్పిన్నర్లు అరౌండ్ ద వికెట్ బంతులేసినప్పుడు పరుగులు తీయడం చాలా కష్టం. కోల్‌కతాలో ఆడుతున్నప్పుడు ద్రవిడ్‌కు అలానే బౌలింగ్ చేయమని దినేశ్ కనేరియాకు చెప్పాను. కానీ ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే అతడి బౌలింగ్‌లో రాహుల్ మరిన్ని పరుగులు సాధిస్తున్నాడు. ఎంతో మంది గొప్ప క్రికెటర్లు అలాంటి బంతులకు ఇబ్బంది పడటం చూశాను. కానీ ద్రవిడ్ ఈ పని ఇంత సులువా అన్నట్టు నిరూపించాడు"
- ఇంజిమామ్ ఉల్ హక్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్
విదేశాల్లో ప్రదర్శనపై..
"విదేశాల్లో ద్రవిడ్ ఎక్కువ పరుగులు చేసేవాడు. మీరు అతడి రికార్డు పరిశీలిస్తే అది ఎంత అమోఘమో అర్థమవుతుంది. 24 వేల పైచిలుకు పరుగులు చేశాడు. అది అంత సులువుకాదు. మీరు అతడినే అడిగితే తెలుస్తుంది. దాదాపు 20 ఏళ్ల పాటు నిలకడగా అత్యుత్తమ ప్రదర్శన చేస్తేనే అది సాధ్యపడింది" అని రాహుల్ గురించి ఇంజిమామ్ చెప్పాడు.
ఇదీ చూడండి: 'ద్రవిడ్ అడుగుజాడల్లో పాక్ మాజీలు నడవాలి'