ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టుపై భారత్ పట్టు బిగించింది. తాత్కాలిక కెప్టెన్ అజింక్యా రహానె(112; 223 బంతుల్లో 12x4) శతకానికి.. రవీంద్ర జడేజా (57; 159 బంతుల్లో 3x4) అర్ధశతకం తోడవ్వడం వల్ల తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియాపై కీలకమైన 131 పరుగుల ఆధిక్యం సంపాదించింది.
సోమవారం ఉదయం 277/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ తొలి సెషన్‌లో మరో 49 పరుగులు జోడించి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. తొలుత జట్టు స్కోర్ 294 పరుగుల వద్ద రహానె రనౌట్ కాగా, మరో ఆరు ఓవర్లకే జడేజా పెవిలియన్ చేరాడు. స్టార్క్ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో భారత్ 306 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది.
అనంతరం అశ్విన్(14), ఉమేశ్ (9) కాసేపు క్రీజులో నిలవగా లియోన్ ఈ జోడీని విడదీశాడు. ఓ చక్కటి బంతికి ఉమేశ్‌ను స్లిప్‌లో స్టీవ్‌స్మిత్ చేతికి చిక్కేలా చేశాడు. అప్పటికి భారత్ స్కోర్ 325/8గా నమోదైంది. అదే స్కోర్ వద్ద అశ్విన్, మరో పరుగు తర్వాత బుమ్రా ఔటవ్వడం వల్ల భారత ఇన్నింగ్స్‌కు 326 పరుగుల వద్ద తెరపడింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 3, లియోన్ 3, కమిన్స్ 2, హెజిల్‌వుడ్ 1 వికెట్లు తీశారు.