ఆస్ట్రేలియాతో జరిగే ఆఖరి రెండు టెస్టులకు టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. అతడి సతీమణి అనుష్క శర్మ జనవరిలో ప్రసవించే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఆమె వద్దే ఉండేందుకు అతడు పితృత్వపు సెలవులు తీసుకొంటాడని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కోహ్లీ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఈ విషయం బోర్డుకు చెప్పలేదు.
"కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని బీసీసీఐ నమ్ముతుంది. ఒకవేళ కెప్టెన్ కోహ్లీ పితృత్వపు సెలవులు తీసుకోవాలనుకుంటే తొలి రెండు టెస్టులకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. సాధారణ పరిస్థితుల్లో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత క్రికెటర్లు వెళ్తుంటారు. అంటే ఒక టెస్టు ముగిశాక వెళ్లి మళ్లీ రావొచ్చు. కరోనాతో 14 రోజుల క్వారంటైన్ ఉండటం వల్ల వెళ్లి రావడం కష్టం"
-బీసీసీఐ అధికారి
నవంబర్ 11న ఆస్ట్రేలియాకు బయల్దేరుతుంది టీమ్‌ఇండియా. వరుసగా 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టులు ఆడనుంది. ఆసీస్‌తో తొలిసారి డే/నైట్ టెస్టులో తలపడనుంది. డిసెంబర్ 17-21 వరకు అడిలైడ్‌లో ఈ పోరు జరుగుతుంది. ఆ తర్వాత టెస్టులకు మెల్‌బోర్న్ (26-30), సిడ్నీ (జనవరి 7-11, 2021), బ్రిస్బేన్ (జనవరి 15-19) ఆతిథ్యమిస్తాయి.