నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన నిర్ణయాత్మక నాలుగో టీ20లో కోహ్లీసేన అద్భుత విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచులో అదరగొట్టింది. ఇంగ్లాండ్‌ను 8 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 2-2తో సిరీస్‌ను సమం చేసి ఆఖరి సమరానికి సైరన్ మోగించింది. 186 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ను 177/8కి పరిమితం చేసింది. భువనేశ్వర్ (1), శార్దూల్ ఠాకూర్ (3), రాహుల్ చాహర్ (2), హార్దిక్ (2) ఆ జట్టును దెబ్బకొట్టారు. ఓపెనర్ జేసన్ రాయ్ (27 బంతుల్లో40), జానీ బెయిర్ స్టో (19 బంతుల్లో 25), బెన్ స్టోక్స్ (23 బంతుల్లో 46)ను నిలువరించారు.
అంతకు ముందు సూర్యకుమార్ (31 బంతుల్లో 57), శ్రేయస్ అయ్యర్ (18 బంతుల్లో 37), రిషభ్ పంత్ (23 బంతుల్లో 30) రాణించారు. దీంతో 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి టీమ్ఇండియా 185 పరుగులు చేసింది.
సూర్య 'ఫైర్'
భారత్‌లో సూర్యకుమార్ యాదవ్ (31 బంతుల్లో 57; 6×4, 3×6) ఆటే హైలైట్. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జట్టును అతడే ఆదుకున్నాడు. విధ్వంసకరమైన షాట్లతో విరుచుకుపడ్డాడు. రోహిత్ శర్మ (12 బంతుల్లో 12) ఔటైన వెంటనే వచ్చిన సూర్య ఆడిన తొలి బంతినే సిక్సర్‌గా మలిచి ప్రమాద ఘంటికలు మోగించాడు. 28 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. రాహుల్‌తో కలిసి రెండో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యం అందించాడు. రెండు చక్కని షాట్లు ఆడిన రాహుల్ ఫామ్‌లోకి వచ్చాడనుకుంటే జట్టు స్కోరు 63 వద్ద అతడిని స్టోక్స్ బోల్తా కొట్టించాడు. రషీద్ బౌలింగ్‌లో ఎదురుదాడి చేయిబోయి కోహ్లీ (1) స్టంఔట్ అయ్యాడు.
శ్రేయస్, పంత్ కీలక భాగస్వామ్యం
వెంటవెంటనే రెండు వికెట్లు చేజార్చుకోవడంతో రిషభ్ పంత్ (23 బంతుల్లో 30) నిలకడగా ఆడాడు. మరోపక్క సూర్య మాత్రం చక్కని షాట్లతో చెలరేగాడు. వీరిద్దరూ మంచి బంతులను గౌరవిస్తూనే ఐదో వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. జోరు పెంచే క్రమంలో సూర్యను.. కరన్ ఔట్ చేశాడు. అప్పటికి స్కోరు 110. ఈక్రమంలో పంత్‌కు శ్రేయస్ అయ్యర్ (18 బంతుల్లో 37) జత కలిశాడు. ఐదో వికెట్‌కు 34 పరుగుల భాగస్వామ్యం అందించాడు. జట్టు స్కోరు 144 వద్ద పంత్‌ను ఆర్చర్ బౌల్డ్ చేశాక శ్రేయస్ మెరుపు మెరిపించాడు. వరుస బౌండరీలు బాదాడు. 19 ఓవర్లకు స్కోరును 170 దాటించాడు. ఆఖరి ఓవర్లో శ్రేయస్ వెనుదిరిగినా సుందర్ (4), శార్దూల్ ఠాకూర్ (10*) బౌండరీలు బాది టీమ్‌ఇండియాను 185/8తో నిలిపారు. జోఫ్రా ఆర్చర్ 4 వికెట్లు తీశాడు.
చివరి మ్యాచ్ ఈ నెల 20న జరగనుంది.