భారత క్రికెట్ అధికారులు క్రమం తప్పకుండా తనను 'ద హండ్రెడ్'(100 బంతుల టోర్నీ) గురించి అడుగుతున్నారని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అవుట్గోయింగ్ ఛైర్మన్ కొలిన్ గ్రేవ్స్ చెప్పాడు. ఈసీబీ సరికొత్తగా ప్రవేశపెట్టిన ఈ లీగ్ ద్వారా క్రికెట్‌పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచేందుకు ఉపయోగపడుతుందని అన్నాడు. వంద బంతుల లీగ్ ఈ ఏడాది ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా ప్రభావంతో వచ్చే ఏడాదికి వాయిదా పడింది.
"కొన్ని విదేశీ క్రికెట్ బోర్డులు.. ముఖ్యంగా భారత్ ఈ టోర్నీపై ఆసక్తిగా ఉంది. గతేడాది నుంచి ప్రతిరోజూ దీని గురించి నన్ను అడుగుతూనే ఉన్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ లీగ్ ఎంతో ఆకట్టుకోనుందని భావిస్తున్నా"
కొలిన్ గ్రేవ్స్, ఈసీబీ ఛైర్మెన్
ఒకవేళ బీసీసీఐ 'ద హండ్రెడ్' లీగ్‌ను నిర్వహించాలని అనుకున్నా.. ప్రస్తుత పరిస్థితుల వల్ల 2023 వరకు అది సాధ్యం కాకపోవచ్చు. కరోనా కారణంగా భవిష్యత్ ప్రణాళికలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఇలాంటి టోర్నీలు జరిపేందుకు అవకాశాలేవీ కనిపించడం లేదు. మరోవైపు మినీ ఐపీఎల్‌ను ప్రవేశపెట్టే ఆలోచన భారత బోర్డు ఉన్నప్పటికీ తేదీలు కుదరకపోవడం వల్ల అమలు చేయలేకపోయింది.
ఐసీసీ ఛైర్మన్ పదవిపై దృష్టి సారించిన గ్రేవ్స్.. ఈ టోర్నీని ప్రారంభించడం తనకెంతో ముఖ్యమని చెప్పాడు. తన ఐదేళ్ల పదవీ కాలంలో అతిపెద్ద సవాలు 'ద హండ్రెడ్' లీగ్ నిర్వహణ అని పేర్కొన్నాడు. "వంద బంతుల టోర్నీ నిర్వహించడం పెద్ద సవాలని భావిస్తున్నా. మొదట అన్ని విధాలుగా సహకారం లభించింది. ప్రస్తుతం అందరూ దీని ప్రయోజనాలను గుర్తించడం ప్రారంభించారు. ఈ విషయంలో ముందుకు సాగేందుకు సరైన సమయం ఇదే. ఈసీబీకి ఆర్థికంగానూ సాయపడుతుంది" అని గ్రేవ్స్ పేర్కొన్నాడు.