అసోం గువహటి వేదికగా మహిళల బారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టీ 20లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలుపొంది అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరించనుంది.
ఇంతకు ముందు న్యూజిలాండ్ పర్యటనలో వన్డే సిరీస్ 2-1తో గెలిచి, పొట్టి ఫార్మాట్‌ను 0-3 తేడాతో ఓడిపోయింది ఉమెన్ ఇన్ బ్లూ.
టీ20 సారధి హర్మన్ ప్రీత్ కౌర్ మోకాలి గాయం నుంచి కోలుకోలేదు. దాంతో సూపర్ ఫాంలో ఉన్న స్మృతి మంధానకు కెప్టెన్‌గాను నిరూపించుకునే అవకాశం లభించింది. కివీస్ పర్యటనలో సెంచరీ, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలు చేసిన ఆమె ఇప్పటికే బ్యాట్స్ ఉమెన్‌గా విజయవంతమైంది.
హార్మన్ ప్రీత్ గైర్హాజరుతో అందరి కళ్లు మిథాలీ ఆటపైనే ఉండనున్నాయి. న్యూజిలాండ్ పర్యటనలో ఆమెకు తొలి రెండు టీ20ల్లో అవకాశం లభించలేదు. మూడో మ్యాచ్‌లో 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఇక ఈ సిరీస్‌లో ఎలా ఆడుతుందో చూడాలి.
వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌కు ముందే ఆమె రిటైరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఈ సిరీస్‌లో మిథాలీ అనుభవం జట్టుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో...!
గతేడాది టీట్వంటీ ప్రపంచకప్ తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇస్తోంది వేద కృష్ణమూర్తి. హర్లిన్ డియోల్, భారతి పుల్మలి తమ బౌలింగ్‌ను నిరూపించుకునేందుకు ఇదే సరైన అవకాశం. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కోమల్ జంజడ్ ఈ సిరీస్‌తో అరంగేట్రం చేస్తోంది. శిఖా పాండే పేస్ బౌలింగ్ బాధ్యతలు చూడనుంది.