ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ విజయంపై స్పందించాడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. తొలి టెస్టు ఓటమి అనంతరం చెన్నై టెస్టులో పుంజుకోవడం తనకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిన విషయని తెలిపాడు. ఆ టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడినప్పటికీ.. అనంతరం సిరీస్‌ను గెలవడం ఆనందంగా ఉందన్నాడు. వచ్చిన అవకాశాలను యువ ఆటగాళ్లు అందిపుచ్చుకున్నారని విరాట్ ప్రశంసించాడు.
"తొలి టెస్టులో టాస్ కీలకంగా మారింది. బౌలర్లకు అస్సలు కలిసిరాలేదు. అందుకే ఓడిపోయాం. అయినప్పటికీ.. రెండో టెస్టులో తిరిగి గాడిన పడడం ఆనందంగా అనిపించింది. రెండో టెస్టులో 160 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో రోహిత్ జట్టును తిరిగి పోటీలో నిలిపాడు. అవసరమైనప్పుడల్లా అతడు విలువైన భాగస్వామ్యాలు నిర్మించాడు. మా ముఖ్య ఆటగాళ్లలో అశ్విన్ ఒకడు. వీరిద్దరూ ఈ టెస్టు సిరీసులో రాణించారు. జట్టుకు అవసరమైన సమయంలో చేలరేగిన రిషభ్, సుందర్.. గెలుపులో కీలక పాత్ర పోషించారు."
-విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్.
"అంతర్జాతీయ క్రికెట్లో ప్రతి జట్టు నాణ్యమైనదే. సొంతగడ్డపై అయినా సరే ప్రత్యర్థిని ఓడించేందుకు శ్రమించాల్సి ఉంటుంది. విజయాల పరంపరను కొనసాగించడం ముఖ్యమైన అంశం. మా జట్టు లక్ష్యమూ అదే. టీమ్ఇండియా రిజర్వు బెంచ్ అత్యంత పటిష్ఠంగా ఉండడం.. భారత క్రికెట్‌కు శుభసూచకం. ఇప్పుడు మేం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ సవాల్‌ను స్వీకరిస్తున్నాం. 2020లో మేం కివీస్ చేతిలో దారుణంగా ఓడాం. కానీ ఇప్పుడు మెరుగ్గా ఉన్నాం," అని కోహ్లీ తెలిపాడు.
ఇదీ చదవండి: 'సొంతగడ్డ'పై ఎదురులేని భారత్