బ్రిస్బేన్ వేదికగా జరుగుతోన్న భారత్-ఆస్ట్రేలియా నిర్ణయాత్మక చివరి టెస్టు ఉత్కంఠకు దారితీసింది. వర్షం కారణంగా నాలుగో రోజు ఆటలో 23 ఓవర్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఓవర్‌నైట్ స్కోరు 21/0తో సోమవారం ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియా.. 294 పరుగులకే కుప్పకూలింది. అయితే, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని టీమ్ఇండియా ముందు ఆతిథ్య జట్టు 328 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో గబ్బా మైదానంలో భారత్ విజయావకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఓటమెరుగని ఆసీస్
బ్రిస్బేన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియాకు మంచి రికార్డుంది. 1988 నుంచి అక్కడ ఒక్క టెస్టు కూడా ఓడిపోలేదు కంగారూ జట్టు. అక్కడ ఆడిన 31 టెస్టుల్లో 24 మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 1988లో వెస్టిండీస్ చివరిసారిగా ఇక్కడ టెస్టు మ్యాచ్ గెలిచింది.
గబ్బాలో అత్యధిక ఛేదన ఎంతంటే?
గబ్బా వేదికగా జరిగిన టెస్టు(1988)లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన చివరి జట్టు వెస్టిండీస్. అలాగే ఇక్కడ అత్యధిక ఛేదన కూడా విండీస్ పేరిటే ఉంది. 1951లో జరిగిన టెస్టు నాలుగో ఇన్నింగ్స్లో ఈ జట్టు 236 పరగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.
నాలుగో ఇన్నింగ్స్ అత్యధిక స్కోర్ ఎంతంటే?
గబ్బా వేదికగా నాలుగో ఇన్నింగ్స్లో వెస్టిండీస్ చేసిన 236 పరుగుల కంటే ఎక్కువ రన్స్నే సాధించాయి పలు జట్లు. కానీ విజయం మాత్రం సాధించలేకపోయాయి. 2016లో ఆస్ట్రేలియా విధించిన 490 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్థాన్ 450 పరుగులు చేసింది. ఇదే ఇక్కడ నాలుగో ఇన్నింగ్స్ అత్యధిక స్కోర్.
భారత జట్టు పరిస్థితి?
గబ్బా వేదికగా నాలుగో ఇన్నింగ్స్లో అత్యధికంగా 355 పరుగులు సాధించింది టీమ్ఇండియా. 1968లో జరిగిన ఈ మ్యాచ్లో 39 పరుగులతో ఓడిపోయింది.
ప్రస్తుతం
నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసేసరికి 1.5 ఓవర్లకు 4/0తో నిలిచింది టీమ్ఇండియా. తొలి ఓవర్‌లోనే రోహిత్ (4*) బౌండరీ బాది మంచి లయలో ఉన్నట్లు కనిపించాడు. గిల్ జాగ్రత్తగా ఆడుతున్నాడు. ఇంకా భారత్ విజయానికి 324 పరుగులు అవసరం ఉన్నాయి. కాగా, భారత జట్టు గెలిచి రికార్డు సృష్టిస్తుందో లేక చేతులెత్తేస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.