టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై ప్రశంసల జల్లు కురిపించాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా. పరిమిత ఓవర్ల క్రికెట్లో సారథి కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా లాంటి స్టార్ ఆటగాళ్ల కన్నా అతడే కీలకమైన ఆటగాడిగా ఆవిర్భవించనున్నాడని జోస్యం చెప్పాడు.
"పరిమిత ఓవర్ల ఫార్మాట్లో హార్దిక్.. తక్కువ కాలంలోనే కీలకమైన ఆటగాడిగా మారుతున్నాడు. అతడి దూకుడు ఇలానే కొనసాగడం అవసరం. కోహ్లీ, రోహిత్, బుమ్రా కన్నా విలువైన ఆటగాడిగా పాండ్యా మారతాడు. ఒకవేళ వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయం సాధిస్తే.. అందులో కీలక పాత్ర అతడిడే అవుతుంది."
-ఆకాశ్ చోప్రా, కామెంటేటర్.
ప్రస్తుతం భారత జట్టులో ఫినిషర్ కొరత ఉందని చెప్పాడు ఆకాశ్ చోప్రా. టాప్ ఆర్డర్లో సెంచరీలతో చెలరేగిపోయే కోహ్లీ, రోహిత్ లాంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ కొంత కాలంగా ప్రపంచకప్‌లో టీమ్ఇండియా విజయం సాధించకపోవడానికి కారణం సరైన ఫినిషర్ లేకపోవడమేనని అన్నాడు. మ్యాచ్‌ను విజయవంతంగా ముగించడానికి జట్టుకు ధోనీ లాంటి ఆటగాడు అవసరమన్నాడు. ఈ పాత్రను పోషించగల నైపుణ్యాలు హార్దిక్‌లో ఉన్నాయని కొనియాడాడు. ఐపీఎల్ 13వ సీజన్‌తో పాటు, ఇటీవల ఆసీస్‌తో జరిగిన రెండో టీ20లో అతడు ఆడిన విధానమే ఇందుకు నిదర్శమని చెప్పాడు.
ఇదీ చూడండి : ధోనీ, కోహ్లీ తర్వాత హార్దిక్ పాండ్యనే అలా!