వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో ఆడేందుకు సాయ శక్తులా ప్రయత్నిస్తానని ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ స్పష్టం చేశాడు. ఇటీవలే సౌతాంప్టన్‌లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్ ముగించుకున్న రూట్.. తన దేశం కోసం ప్రపంచ కప్‌ను తీసుకురావాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు.
"నేను అవకాశాన్ని అసలు వదులుకోను. ఇంగ్లాండ్ బాగా రాణించాలని కోరుకుంటున్నా. ప్రపంచ కప్ జట్టులో ఆడి.. దేశానికి కప్ తీసుకురావాలనుకుంటున్నా. ఒక వేళ నేను తుది జట్టులో లేనట్లయితే.. ఏం పర్వాలేదు. ఎవరైతే ఇందులో పాల్గొంటారో వారందరికీ నేను మద్దతుగా నిలుస్తా. ఈ విషయంపై ఎంపిక ఎంత కష్టమో నాకు తెలుసు. నా కన్నా మంచి క్రికెటర్లు ఉంటే.. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ, ప్రపంచ కప్‌లో ఆడేందుకు కచ్చితంగా నేను చేయగలినదంతా చేస్తా."
-జో రూట్, ఇంగ్లాండ్ క్రికెటర్
రూట్ ఇప్పటి వరకు 97 టెస్టులు, 146 వన్డేల్లో ఆడాడు. అయితే, టీ20ల్లో కేవలం 32 సార్లు మాత్రమే ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలోనే అతని టీ20 కెరీర్‌పై అనిశ్చితి నెలకొంది.