ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం టీమిండియా పర్యటనను సందేహంలో పడేసింది. ఆ దేశంలోనికి రానున్న ఆరు నెలల్లో ఎవరూ రాకుండా ప్రయాణ నిషేధం విధించడమే ఇందుకు కారణం. దీనివల్ల ఈ ఏడాది అక్టోబరు నుంచి డిసెంబర్ వరకు భారత్-ఆసీస్ మధ్య జరగాల్సిన టీ20, వన్డేలు, టెస్టులు జరుగుతాయా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం కరోనా ప్రభావం ప్రపంచదేశాలపై తీవ్రంగానే ఉంది. ఈ వైరస్.. ఇప్పటికే ఆస్ట్రేలియాలో 4000 మందికిపైగా సోకగా, 17 మంది మరణించారు. అందువల్లే దేశ సరిహద్దుల్ని మూసేశారు. దీంతో అక్టోబరు 18 నుంచి మొదలు కావాల్సిన పురుషుల టీ20 ప్రపంచకప్ నిర్వహణపైనా సందేహాలు వస్తున్నాయి.
"ఆసీస్ పర్యటన గురించి ఇప్పడే చెప్పలేం. ఆ దేశంలోకి రాకుండా ఆరునెలల ప్రయాణ నిషేధం విధించారు. ఒకవేళ పరిస్థితుల చక్కబడితే ముందే దానిని ఎత్తేయొచ్చు" -బీసీసీఐ సీనియర్ అధికారి
ఒకవేళ టీ20 ప్రపంచకప్ ముందుకు జరిగితే, అనంతరం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన టెస్టు ఛాంపియన్షిప్ మ్యాచ్‌లపైనా వాటి ప్రభావం పడుతుంది. మరి ఏమవుతుందో వేచి చూడాలి.