టెస్టు నిడివి నాలుగు రోజులకు కుదించాలనే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రతిపాదనను ఇప్పటికే మాజీలు, సీనియర్ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది ఐసీసీ. దీనికి టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే నేతృత్వం వహిస్తున్నాడు. మార్చిలో జరగనున్న ఐసీసీ సమావేశంలో ఈ అంశంపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు.
దుబాయ్ వేదికగా మార్చి 27 నుంచి 31 వరకు ఐసీసీ సమావేశం జరగనుంది. 4 రోజుల టెస్టు ప్రతిపాదనపై నియమించిన కమిటీలో కుంబ్లేతోపాటు ఆండ్రూ స్ట్రాస్, రాహుల్ ద్రవిడ్, మహేలా జయవర్ధనే, షాన్ పొలాక్ సభ్యులుగా ఉన్నారు.
"ఐసీసీ కమిటీలో భాగంలో ఉన్నా కాబట్టి ప్రస్తుతం ఈ అంశంపై నా అభిప్రాయం చెప్పాలేను. రానున్న సమావేశంలో చర్చించి అప్పుడు మాట్లాడతా" -అనిల్ కుంబ్లే, టీమిండియా మాజీ క్రికెటర్
2023-31 మధ్య కొత్త భవిష్యత్ పర్యటనల ప్రణాళికలో పూర్తిగా నాలుగు రోజుల టెస్టులే ఆడించాలని ఐసీసీ భావిస్తోంది. ఈ విధానాన్ని క్రికెటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇదీ చదవండి: ఫ్లెమింగ్ రికార్డు బ్రేక్ చేసిన రాస్ టేలర్