ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో.. భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ మొదటి స్థానంలోనే కొనసాగుతున్నాడు. 928 పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో మూడు సిరీస్‌లు ఆడిన ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్... పెద్దగా రాణించలేదు. ఫలితంగా 911 పాయింట్లతో రెండో స్థానానికే పరిమితమయ్యాడు. ఆస్ట్రేలియాకు చెందిన సంచలన బ్యాట్స్‌మన్ మార్కస్ లబుషేన్... ఒక స్థానం మెరుగుపర్చుకుని 3వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. మొత్తం 827 పాయింట్లతో ఉన్నాడు.
టాప్-10లో మరో భారతీయ బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారా.. ఒక ర్యాంక్ కోల్పోయి 6వ స్థానంలో నిలిచాడు. అజింక్య రహానే... రెండు స్థానాలు కోల్పోయి 9లో కొనసాగుతున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాపై రాణించిన ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్... 5 పాయింట్లు ఎగబాకి టాప్-10లోకి చేరాడు.
బౌలింగ్‌లో
బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో జేసన్ హోల్డర్.. ఒక ర్యాంక్ మెరుగుపర్చుకొని 3వ స్థానానికి చేరాడు. ఆస్ట్రేలియా పేసర్ స్టార్క్ 2 పాయింట్లు మెరుగుపర్చుకొని 5వ ర్యాంక్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్.. ఇటీవల ఐదు వికెట్లతో రాణించాడు. 5 స్థానాలు ఎగబాకి 7వ ర్యాంక్‌లో నిలిచాడు.
భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా(6), అశ్విన్(9), షమి(10) అదే స్థానాల్లో కొనసాగుతున్నారు. తొలి రెండు స్థానాల్లో పాట్ కమిన్స్(ఆస్ట్రేలియా), నీల్ వాగ్నర్(ఆస్ట్రేలియా) ఉన్నారు. టాప్-10లో ముగ్గురు భారత బౌలర్లు, ముగ్గురు కంగారూ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.
ఛాంపియన్‌షిప్‌లో టాప్
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. 360 పాయింట్లతో టాప్-1లో ఉంది. గతేడాది దక్షిణాఫ్రికాను 3-0తో వైట్‌వాష్ చేయడమే కాకుండా, వెస్టిండీస్‌తో, బంగ్లాపై 2 టెస్టుల సిరీస్‌లను గెలిచింది. 7 మ్యాచ్‌ల్లోనే ఒక్కటీ ఓడిపోకుండా టాప్‌లో ఉంది.
ఆస్ట్రేలియా 296 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. అయితే 10 మ్యాచ్‌లు ఆడిన కంగారూ జట్టు... 7 మ్యాచ్‌ల్లోనే గెలిచింది. రెండింటిలో ఓడిపోయి.. ఒకటి డ్రా చేసుకుంది.
ఇంగ్లాండ్(86), పాకిస్థాన్(80), శ్రీలంక(80), న్యూజిలాండ్(60), దక్షిణాఫ్రికా(30) జట్లు వరుసగా జాబితాలో ఉన్నాయి. బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఖాతా తెరవలేదు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మొత్తం తొమ్మిది దేశాలు తలపడుతున్నాయి.