ప్రేక్షకుల్లేకుండా టీ20 ప్రపంచకప్ జరిపే విషయాన్ని తాను ఊహించలేకపోతున్నామని చెప్పాడు పాకిస్థాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్. ఈ టోర్నీని నిర్వహించేందుకు సరైన సమయం కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వేచి చూడాలని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేయడం లేదంటే ఖాళీ స్టేడియాల్లో జరపనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్రమ్ ఈ విధంగా స్పందించాడు.
"ప్రేక్షకుల లేకుండా టోర్నీ జరపడం సరైన ఆలోచన కాదు. ప్రపంచకప్‌లో తమ జట్లకు మద్దతుగా తెలిపేందుకు దేశవిదేశాల నుంచి వేలాది మంది అభిమానులు వస్తారు. వేదిక సందడిగా ఉంటుంది. తలుపులు మూసేసి టోర్నీ నిర్వహిస్తే అలాంటి వాతావరణం కనిపించదు. అందువల్ల ఐసీసీ, కొంత సమయం ఎదురుచూసి టీ20 ప్రపంచకప్ జరిపితే బాగుంటుందని నా అభిప్రాయం"
- వసీం అక్రమ్, పాక్ మాజీ పేసర్
టీ20 ప్రపంచకప్ నిర్వహణ విషయమై మే 28న ఐసీసీ సమావేశమైంది. కానీ, ఆ భేటీ తర్వాత ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. జూన్ 10 వరకు ఉన్న పరిస్థితులను అంచనా వేసుకొని, అదే రోజున టోర్నీపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశముంది.
బౌలర్లకు నచ్చదు
బంతిపై లాలాజలం వినియోగం నిషేధించడంపై అక్రమ్ స్పందిస్తూ.. "నాకు తెలిసి ఈ నిబంధన ఫాస్ట్ బౌలర్లకు నచ్చకపోవచ్చు. బంతిని స్వింగ్ చేసేందుకు లాలాజలం లేదా చెమటను వాడటం వారికి అలవాటుగా మారింది. అందువల్ల ఈ సమస్యకు ఓ సరైన మార్గం కావాలి. ఎంత తొందరగా దీనికి పరిష్కారం వెతికితే అంత మంచిది" అని చెప్పాడు.
ఇదీ చూడండి... వివాదాస్పద వ్యాఖ్యలపై యువరాజ్ క్షమాపణ