ఈ ఏడాది మొదట్లో తాను కరోనా వైరస్ బారిన పడినట్లు ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ ఇయాన్ బోథమ్ చెప్పుకొచ్చాడు. అయితే తొలుత కరోనా వైరస్ అనుకోలేదని, కేవలం జ్వరంగా భావించానని వివరించాడు.
"ఆరు నెలల క్రితం ఈ ప్రాణాంతక వైరస్ గురించి ఎవరికీ తెలియదు. దాని పేరు పెద్దగా బయటకు రాలేదు. కానీ, అప్పుడు నాకు ఆ వైరస్ సోకింది. గతేడాది డిసెంబరు చివర్లే లేదా ఈ ఏడాది జనవరి ఆరంభంలో నాకు వైరస్ సంక్రమించింది. అయితే అప్పుడు అది కరోనా అని నాకు తెలియదు. చాలా రోజులే బాధపడ్డా."
- ఇయాన్ బోథమ్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్

ఆగస్టు 1 నుంచి కౌంటీ సీజన్
కరోనా కారణంగా నిరవధిక వాయిదా పడ్డ కౌంటీ సీజన్ ఆగస్టు 1న ఆరంభిస్తున్నట్లు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సోమవారం ప్రకటించింది. "ఈ ఏడాది మహిళల దేశవాళీ క్రికెట్ కూడా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నాం. కానీ నిర్వహణ ప్రణాళికల్లో మార్పులు ఉంటాయి. ఆటగాళ్లు, సిబ్బంది సంరక్షణకే మొదటి ప్రాధాన్యాన్నిచ్చి, ప్రభుత్వం సూచనల మేరకే పురుషుల, మహిళల దేశవాళీ మ్యాచ్లు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తాం. ఆటగాళ్లు జులై 1న లేదా అంతకంటే ముందే సాధన తిరిగి మొదలెట్టొచ్చు" అని ఈసీబీ తెలిపింది.