వెస్టిండీస్ తరపున ప్రాతినిథ్యం వహిస్తూ, మైదానంలో చనిపోయేందుకు వెనుకాడలేదని క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ అంటున్నాడు. ప్రపంచ క్రికెట్లో కొంతమంది అత్యుత్తమ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ, దూకుడైన ఆటకు మారుపేరుగా నిలిచిన ఇతడు.. ఎప్పుడూ హెల్మెట్ పెట్టుకొని ఆడడానికి ప్రాధాన్యతనిచ్చేవాడు కాదు.
"ప్రేమించే ఆట కోసం చనిపోయినా పర్వాలేదనుకునేవాణ్ని. క్రికెట్ పట్ల నాకున్న అభిరుచి అలాంటిది. ఒకవేళ మైదానంలోనే మరణిస్తే అంతకంటే గొప్ప చావు ఏముంటుంది? తమ ప్రాణాలనూ లెక్కచేయకుండా అత్యుత్తమ ప్రదర్శన చేసే అథ్లెట్ల నుంచి స్ఫూర్తి పొందా" అని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌తో ఆడియో సంభాషణలో రిచర్డ్స్ పేర్కొన్నాడు.
"ఫార్ములా వన్ రేసింగ్ కారును నడిపిస్తున్న ఓ కుర్రాణ్ని చూశా. అంతకంటే ప్రమాదకరమైంది ఇంకేముంటుంది" అని రిచర్డ్స్ చెప్పిన దానికి వాట్సన్ చమత్కారంగా.. "హెల్మెట్ లేకుండా 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతిని ఎదుర్కోవడం" అని అన్నాడు.