టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. తాను ఎక్కువ సేపు బౌలింగ్ చేయడానికి గల వెనుక ఉన్న రహస్యాన్ని చెప్పాడు. ఓ రోజుకు కనీసం అతడు 40 ఓవర్లు బౌలింగ్ చేస్తానని తెలిపిన అతడు.. దాని వల్ల తనకు మానసిక ఉల్లాసం పెరుగుతుందని వెల్లడించాడు. అయితే ఎక్కువసేపు బౌలింగ్ చేసే క్రమంలో కొన్ని సందర్భాల్లో అలసట ఆవహించి తన శరీరం సహకరించదని అన్నాడు. కానీ బౌలింగ్‌పై తనకున్న అమితమైన ప్రేమ.. అలాంటి ప్రతికూలత పరిస్థితులను అధిగమిస్తుందని చెప్పుకొచ్చాడు. మరిన్ని అధిక ఓవర్లు బంతిని సంధించగలిగేలా తనలో మానసిక శక్తిని పెంచుతుందని అన్నాడు.
ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో మూడు, నాలుగో రోజు ఆటలో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారని కొనియాడాడు అశ్విన్. ఐదో రోజు కూడా ఇదే ప్రదర్శన కొనసాగిస్తే ఈ మ్యాచులో టీమ్ఇండియా తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచులో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ డాన్ లారెన్స్ వికెట్ తీసి టెస్టు క్రికెట్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్న ఇషాంత్‌ను అశ్విన్ ప్రశంసించాడు. త్వరలోనే 400 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో ఇషాంత్ చేరతాడని ధీమా వ్యక్తం చేశాడు. "అతడి కష్టపడే వ్యక్తిత్వం. ఎంత ఒత్తిడిలో ఉన్నా ఎల్లప్పుడూ నవ్వుతూ కనిపించడం అతడిలో ఉన్న ప్రత్యేకత." అని చెప్పుకొచ్చాడు.
114ఏళ్ల రికార్డు
ఈ మ్యాచులో టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 114 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన తొలి స్నిన్నర్‌గా ఘనతను అందుకున్నాడు. ఇంగ్లాండ్ ఆటగాడు రోరీ బర్న్స్‌ను(0) ఔట్ చేసి ఈ ఫీట్‌ను అందుకున్నాడు.
ఇదీ చూడండి: కపిల్ సరసన ఇషాంత్.. 114 ఏళ్ల రికార్డ్ అశ్విన్ బ్రేక్