భారత్, పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ను తిరిగి పునరుద్ధరించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ ఛైర్మన్ జాకా అష్రాఫ్ బీసీసీఐకి సూచించాడు. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాల కారణంగా భారత ప్రభుత్వం క్రికెట్ ఆడకుండా కఠిన నిర్ణయం తీసుకుంది. దీంతో గత కొద్ది కాలంగా ఇరు దేశాల మధ్య రాజకీయ సంబంధాలతో పాటు క్రికెట్ సంబంధాలు కూడా క్షీణించాయి.
భారత్-పాక్ మధ్య చివరి సారిగా 2007లో టెస్టు సిరీస్ జరిగింది. 2012-13 మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అప్పటి నుంచి ఆసియా కప్, ఐసీసీ టోర్నమెంట్లలో తప్పితే రెండు దేశాల మధ్య ఎటువంటి సిరీస్‌లు జరగలేదు. రానున్న రోజుల్లోనూ దాయాది దేశంతో క్రికెట్ ఆడే పరిస్థితులు కనిపించట్లేదు. ఈ రెండు దేశాలు చివరిసారిగా 2019 ప్రపంచకప్‌లో తలపడ్డాయి. దీంతో అష్రాఫ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
నా పదవీకాలంలో జిన్నా-గాంధీ పేరుతో సిరీస్‌ను ప్రారంభించడానికి ప్రయత్నించాను. ఈ విషయాన్ని బీసీసీఐకి కూడా తెలిపాను. ఉగ్రవాద అంశాల కారణంగా భారత్ ఈ విషయంలో వెనక్కి తగ్గింది.
-జాకా అష్రాఫ్, పీసీబీ మాజీ ఛైర్మన్.
"జిన్నా-గాంధీ పేరుతో సిరీస్ ప్రారంభిస్తే.. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు బలోపేతమవుతాయి. ఇది మరో యాషెస్ సిరీస్‌లా మారుతుంది" అని అష్రాఫ్ పేర్కొన్నారు. అష్రాఫ్ కాలంలోనే ఇరు దేశాలు చివరి ద్వైపాక్షిక సిరీస్‌ను ఆడాయి.
ఇండియాతో ద్వైపాక్షిక సిరీస్‌లకు తటస్థ వేదికలు మేలని అభిప్రాయపడ్డాడు అష్రాఫ్. శ్రీలంక, యూఏఈ, దక్షిణాఫ్రికా వంటి దేశాలలో సిరీస్‌లను నిర్వహిస్తే బాగుంటుందని తెలిపాడు. ఐసీసీ తెచ్చిన ఎఫ్టీపీ నిబంధన కూడా పాకిస్థాన్‌తో, భారత్ క్రికెట్ ఆడకపోవడానికి మరో కారణమని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: 'రాహుల్ ఆడకపోవడం భారత్‌కు మంచిదైంది'